హైదరాబాద్: ఒకనాడు రౌడీయిజానికి, రక్తచరిత్రకు పేరుమోసిన విజయవాడలో మళ్ళీ కులచిచ్చు రగిలేటట్లు కనబడుతోంది. కొన్ని సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న బెజవాడ మళ్ళీ రగులుకునేటట్లుంది. వంగవీటి రంగా 27వ వర్ధంతి సందర్భంగా నిన్న రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ, వంగవీటి రాధా దేవినేని నెహ్రూకు సవాల్ విసిరారు. తన తండ్రి చనిపోయి 27 ఏళ్ళు అయిందని, దేవినేని నెహ్రూ ఈ మధ్యకాలంలో చనిపోయిన తన తండ్రి గురించి పిచ్చివాగుడు వాగుతున్నాడని చెప్పారు. తన తండ్రి రంగాపై 20 మర్డర్ కేసులు ఉన్నాయని అన్నాడని తెలిపారు. చనిపోయినవారిగురించి మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నాడని, అది హీరోయిజం కాదని అన్నారు. నెహ్రూ ఇంట్లో కూర్చుని, తన కనుసైగలతో రాజకీయం చేస్తున్నట్లు పిచ్చి భ్రమలలో బతుకుతున్నాడని చెప్పారు. ఎవరైనా ప్రజల అభిమానంతో సాధించాల్సిందే తప్ప, మనకు మనం డబ్బాలు కొట్టుకుని కాదని అన్నారు. అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేనని – ముళ్ళకంపలాగా ఉంటే చెట్టునే నరికేస్తానని నెహ్రూ అంటున్నాడని చెప్పారు. ఎవరిని నరుకుతావు, ఏమి నరుకుతావంటూ నెహ్రూపై మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలపాటు పదే పదే తమ మౌనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నాడని అన్నారు. తాము నష్టపోయి ఉన్నామని, అలాంటి నష్టం ఏ కుటుంబానికీ జరగకూడదని మౌనంగా ఉన్నామని చెప్పారు. దానిని చేతగానితనంగా తీసుకోవద్దని అన్నారు. సిద్ధమంటే తామూ దేనికైనా సిద్ధమేనని చెప్పారు. ఒకసారి నష్టపోయి ఉన్నామని, మళ్ళీ మళ్ళీ నష్టపోవటానికి నెహ్రూ రెడీ అయితే చెప్పాలని, తాను కూడా రెడీయేనని రాధా అన్నారు.
వంగవీటి రాధా ప్రస్తావించిన నెహ్రూ వ్యాఖ్యలు – కొద్దిరోజుల క్రితం ఆయన టీవీ 9 ఇంటర్వ్యూలో చేసినవి. ముఖాముఖి అనే ఆ కార్యక్రమంలో నెహ్రూ మాట్లాడుతూ, 1979లో మొట్టమొదటగా తన అన్న దేవినేని గాంధి, 1987లో తన రెండో తమ్ముడు మురళి, అతని నలుగురు స్నేహితులు హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ కేసులలో రంగా మొదటి ముద్దాయంటూ పరోక్షంగా రంగా వారిని చంపారని నెహ్రూ అన్నారు. దానికి ప్రతీకారంగా దాడులు జరిగాయని చెప్పారు. తన సోదరులు చనిపోకముందు తనకెప్పుడూ హింసతో సంబంధం లేదని అన్నారు. మొదటిసారి రంగాకేసులో ముద్దాయిగా పెట్టారని చెప్పారు. తన ప్రభుత్వం(తెలుగుదేశం)లోనే తాను మొదటిసారి ముద్దాయినయ్యానని అన్నారు. అరాచకం అనేది కళ్ళముందు కనబడితే ఓర్చుకోలేనని చెప్పారు. రోడ్డుమీద తుమ్మ ముల్లు ఉంటే చాలామంది దానిని తప్పుకుని పక్కకు వెళ్ళిపోతారని అన్నారు. తాను మాత్రం అసలు ఈ తుమ్మముల్లును కాదు తుమ్మచెట్టునే తీసేయాలనుకుంటానని చెప్పారు. పరోక్షంగా రంగా తుమ్మచెట్టులాంటివాడని, అరాచకాలు చేశాడని నెహ్రూ వ్యాఖ్యలు చేశారు. రంగాపై 24 మర్డర్ కేసులు ఉన్నాయని, తనపై రెండే మర్డర్ కేసులు ఉన్నాయని చెప్పారు. తన కుమారుడు అవినాష్ సీ బ్యాచ్(చౌదరి బ్యాచ్)ను నడుపుతున్నాడని, చౌదరి అని వెనక రాసి ఉన్న బైకులతో కుర్రాళ్ళను వెంటేసుకుని తిరుగుతున్నాడన్న ఆరోపణపై మాట్లాడుతూ, కులాల రాజకీయాలకు వ్యతిరేకంగా తన కుమారుడే విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడని చెప్పారు.
దేవినేని నెహ్రూ మొన్నే కాదు, గతంలో ఏబీఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట విత్ ఆర్కే కార్యక్రమంలో కూడా ఇదే ముల్లు-తుమ్మచెట్టు డైలాగ్ చెప్పారు(ఈ ఇంటర్వ్యూలోనే – చంద్రబాబు ఒకసారి నందమూరి హరికృష్ణను పరోక్షంలో మొద్దు లం….కు అని తిట్టారని, తాను రెండుసార్లు టీడీపీలో చేరతానని మనుషులతో సందేశాలు పంపినా చంద్రబాబు సానుకూలంగా స్పందిచలేదని, అందుకే మనసు చంపుకుని కాంగ్రెస్‌లో చేరానని, లక్ష్మీ పార్వతి ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుందనే ఉద్దేశ్యంతో డబ్బును బ్యాగుల్లో పెట్టి ఆప్తులకు ఇస్తే వాటిని కొంతమంది నొక్కేసిన మాట నిజమేనని, తనను ఇటీవలి ఎన్నికలలో ఓడించిన తన సామాజికవర్గానికి తాను ఇప్పుడు అడ్డం తిరిగానని, తనకు ఎన్టీఆర్,వైఎస్ఆర్ సమానమని నెహ్రూ చెప్పారు). ఆ రెండు ఇంటర్వ్యూలను దృష్టిలో పెట్టుకునే రాధా నెహ్రూకు సవాల్ విసిరారు. ఆ రెండు ఇంటర్వ్యూలలో నెహ్రూ వ్యాఖ్యలకు సమాధానం చెప్పటానికి రంగా వర్ధంతిని రాధా వేదికగా మార్చుకున్నారు.
అయితే అసలు ఇటీవలి కాలంలో నెహ్రూకు వంగవీటి వర్గంతో కాకుండా సొంత సామాజికవర్గంతోనే గొడవలు ఎక్కువగా అయిన విషయం విజయవాడ వాసులందరికీ తెలిసిందే. వల్లభనేని వంశీకి, నెహ్రూకు మధ్య గొడవలు ఆ మధ్య తారాస్థాయికి వెళ్ళాయి. వంశీ పరిటాల రవికి సిగిరెట్లు మోసాడని, మద్దెలచెరువు సూరి దగ్గరకు వెళ్ళి రవిని చంపుతానని డబ్బులు తీసుకున్నాడని నెహ్రూ ఆరోపించారు. అది తెలిసి రవి వంశీ మీద దాడి చేయాలనుకుంటే మళ్ళీ రవిదగ్గర చేరి డబ్బులు తీసుకుని సూరిని చంపుతానని బయలుదేరాడని చెప్పారు. జైలునుంచి హాస్పిటల్‌కు వెళ్ళేలోపు అమ్మాయిలను ఏర్పాటుచేసి సూరిని చంపటానికి ప్లాన్ చేస్తే అది సూరి గమనించి వంశీని లేపేయాలని అనుకున్నాడని అన్నారు. ఇది తెలిసి వంశీ మళ్ళీ రవిదగ్గరకు పరిగెత్తుకునివచ్చి రక్షించమని కాళ్ళమీద పడి వేడుకున్నాడని చెప్పారు. దీనికి వంశీ ప్రెస్ మీట్లో స్పందిస్తూ, నెహ్రూలాగా శవాలమీద పేలాలు ఏరుకునే బ్యాచ్ కాదని అన్నారు. నెహ్రూలాగా ఎవడి భూమి కబ్జా చేయలేదని, ఎవడిదగ్గరా డబ్బులు తినలేదని చెప్పారు. ముసలి రౌడీవి, కళ్ళు కనబడవు, కిడ్నీలు పోయాయంటూ దుర్భాషలాడారు. సురేంద్రబాబు ఉన్నపుడు ఇదే నెహ్రూ బురదపాములాగా ఏ రకంగా బతికాడనేది అందరికీ తెలుసని అన్నారు. కమిషనర్ గట్టిగా ఉండటంతో నెహ్రూ ఉచ్చ పోసుకోటానికి కూడా వణికాడనేది తెలుసని చెప్పారు. నెహ్రూ అనేవాడు ఈ నగరానికి పట్టిన చీడపురుగని అన్నారు. దమ్ముంటే నెహ్రూగాడిని రమ్మనండి, వాడికి దమ్ములేదా, ధైర్యం లేదా అంటూ సవాల్ విసిరారు. అయితే ఆ రోజు వంశీ సవాల్‌ను నెహ్రూ పెద్దగా పట్టించుకోలేదు. మరి తాజాగా రాధా విసిరిన సవాల్‌ను ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి. మరోవైపు ఎన్నికలలో ఓడిపోయిననాటినుంచి సొంత సామాజికవర్గానికి నెహ్రూ దూరమైన సంగతి తెలిసిందే. నగరంలోని లయోలా కాలేజి వాకర్స్ క్లబ్ ఎన్నికలవంటి వివిధ విషయాలలో సొంత సామాజికవర్గానికి వ్యతిరేకంగా చేశారు. ఇటీవల కాల్‌మనీ వ్యవహారంలోకూడా నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ నిప్పులు చెరిగారు. గతంలో రంగా గొడవల సమయంలో పూర్తిగా వెన్నుదన్నుగా ఉన్న తన సామాజికవర్గం అండ లేకుండా ఇప్పుడు నెహ్రూ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది.