వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలని.. టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. శుక్రవారం మరోసారి వంగవీటి రాధా చంద్రబాబునాయుడును కలిశారు. చంద్రబాబు ఆయన ముందు … రెండు ప్రతిపాదనలు పెట్టినట్లు చెబుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పెడనతో లింకు పెట్టారు. ప్రస్తుతం మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి కొనకొళ్ల నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన లోక్‌సభకు కాకుండా శాసనసభకు పోటీ చేస్తానని పట్టుబట్టారు. కానీ మచిలీపట్నం స్థానం బలహీన వర్గాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొనకొళ్లనే పోటీ చేయాలని చంద్రబాబు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ మాత్రం పెడన నియోజకవర్గంపై దృష్టి సారించారు. పెడనకు తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా తన కుమారుడికి చాన్సివ్వాలంటున్నారు.
వంగవీటి రాధా నిర్ణయంపైనే పెడనకు అభ్యర్థి ఎంపిక ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వంగవీటి రాధా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అసెంబ్లీకే రావాలని వంగవీటి రాధా అనుకుంటున్నారు. వంగవీటి రాధాను బందరు పార్లమెంట్‌కు పంపించి, పెడన నుంచి ఎంపీ కొనకొళ్ల నారాయణ రంగంలోకి దిగాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండింటిలో పోటీ చేస్తారా లేదా ఎమ్మెల్సీ కోరుకుంటారా అనేది తేలాల్సి ఉంది. నిజానికి పోటీ విషయం చంద్రబాబుకే అప్పగించినట్లు.. చేరిక సమయంలో వంగవీటి రాధా ప్రకటించారు.
వంగవీటి రాధా.. మాస్ లీడర్. ఆయనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టాలని.. టీడీపీ అధినేత భావిస్తున్నారు. అందుకే.. ఆయన కోసం.. సమన్వయ కమిటీని ప్రత్యేకంగా … స్థానాలను పరిశీలించమని చెబుతున్నారు. అంతకు ముందు ఒంగోలు, అనకాపల్లి స్థానాల గురించి చర్చ జరిగినా… వాటిని ప్రాథమిక దశలోనే పక్కకు తప్పించారు. ఇప్పుడు… మచిలీపట్నం పార్లమెంట్, పెడన అసెంబ్లీ స్థానాల చుట్టూ తిరుగుతోంది. పోటీ అయితే ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.