రాజధాని ఉద్యమంలో వంగవీటి రాధాకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ.. ఏదో చోట ఉద్యమంలో పాల్గొంటున్నారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర కూడా చేశారు. తెలుగుదేశంతో పాటు.. వైసీపీ మినహా ఇతర పార్టీలకు చెందిన వారంతా.. రాజధాని ఉద్యమానికి సంఘిభావం ప్రకటిస్తున్నారు కానీ.. ఇలా ఫుల్ టైం.. ఉద్యమానికే పని చేస్తున్న దాదాపు ఎవరూ లేరు. ఒక్క వంగవీటి రాధాకృష్ణ మాత్రమే.. చురుకుగా వ్యవహరిస్తున్నారు. గతంలో… ఇతర పార్టీల్లో నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్నప్పుడో.. మరో పదవిలో ఉన్నప్పుడో.. ఆయన రాజకీయ కార్యక్రమాలు ఇంత సుదీర్ఘంగా చేపట్టింది లేదు. రాజకీయాల పరంగా చాలా తక్కువ మాట్లాడుతూ.. చాలా తక్కువ బయట కనిపించే వంగవీటి రాధాకృష్ణ.. రాజధాని ఉద్యమం కోసం ఇంత చురుకుగా పని చేయడం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
రైతులకు మద్దతుగా ఆయన పోరాడుతున్నారు కానీ… ఎక్కడా రాజకీయ లబ్ది కోసం ఆయన ప్రకటనలు చేయడం లేదు. రైతులకు న్యాయం జరగాలన్నట్లుగానే మాట్లాడుతున్నారు. మీడియాలో పెద్దగా ప్రచారం రాకపోయిన్పటికీ.. గత రెండు వారాలుగా.. వంగవీటి రాధాకృష్ణ చాలా యాక్టివ్గా… ఉన్నారు. పాదయాత్ర కూడా చేశారు. విజయవాడలోనూ.. ప్రదర్శనలు నిర్వహించారు. ప్రతీ రోజూ.. అమరావతి గ్రామాలకు వెళ్తున్నారు. వంగవీటి రాధా దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలు మానేశారు.
గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి… ప్రచారం చేసినప్పటికీ సానుకూల ఫలితాలు రాలేదు. ఆ తర్వాత సైలెంటయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలు మానుకోవాలనుకుంటున్నారని చెప్పుకున్నారు. కానీ.. ఆయన తనపై వచ్చే రూమర్లకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. చేతలతోనే.. తాను ఓటమి వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గబోనని.. చెబుతున్నట్లుగా ఉంది. వంగవీటి రాధా ఈ విధంగా యాక్టివ్ అవ్వడం టీడీపీ వర్గాలను సైతం.. సంతోష పరుస్తోంది.