వంగవీటి రాధా పార్టీ మార్పు అంటూ అదే పనిగా ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియాలకు కొదవ లేదు. ఆయనే ఎందుకు సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తున్నారో కానీ.. మీడియా మాత్రం టీడీపీ నుంచి ఎప్పుడు బయటకు పంపిద్దామా అని ఆత్రంగా చూస్తూ ఉంటుంది. ఇటీవల ఆయన టీడీపీకి రాజీనామా చేశారని.. జనసేనలో చేరబోతున్నారని ప్రచారం చేశారు. అసలు రాజీనామా లే్ఖను పంపేశారని కొన్ని మీడియాలు రాశాయి. కానీ ఇలాంటి రాతలకు అలవాటుపడిన వంగవీటి రాధా మాత్రం స్పందించలేదు.
ఆయన మంగళవారం పీలేరులో నారా లోకేష్ పాదయాత్రలో కలిశారు. సంఘిభావంగా కొంత దూరం పాదయాత్ర చేశారు. తర్వాత రెండు గంటల పాటు కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నారా లోకేష్ రాధాను రిసీవ్ చేసుకున్న విధానం.. ఆప్యాయంగా మాట్లాడుకున్న వైనం చూస్తే.. రాధాకు పార్టీ మారే ఆలోచన లేదని ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఆయనపై పదే పదే ఎందుకు రూమర్స్ క్రియేట్ చేస్తారో కానీ.. రాధా మాత్రం వీటన్నింటినీ లైట్ తీసుకుంటున్నారు.
వైసీపీలో ఉన్న ఆయన మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ రాజకీయంగా .. వంగవీటి రాధాను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వంగవీటి రాధా ఏదైనా ఫంక్షన్ కు వెళ్తున్నారని తెలిస్తే కరెక్ట్ గా ఆయన వెళ్లే సమయానికే వెళ్లి మొహమాట పెట్టిపక్కకు తీసుకెళ్లి మాట్లాడి.. మీడియాకు లీకులిస్తారు. తర్వాత బ్లూ మీడియా వైసీపీలో రాధా అని ప్రచారం చేస్తుంది. ఇలాంటి డ్రామాలు చాలా కాలంగా సాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా జనసేన అంటూ ప్రారంభించారు. అన్నింటికీ ఈ రోజూ తన చేతలతోనే వంగవీటి రాధా క్లారిటీ ఇచ్చారని అనుకోవచ్చు.