హైదరాబాద్: వంగవీటి రంగాను చంపిన శత్రువులను పచ్చిబూతులు తిడుతూ ఉంటానని ఆయన కుమారుడు వంగవీటి రాధా చెప్పారు. ఆయన నిన్న ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రంగాను చంపింది దేవినేని నెహ్రూయేనని అన్నారు. రంగా హత్యకేసులో దోషులకు శిక్షపడలేదని మధనపడ్డారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, తానెంత మధనపడతాననేది తెలుసుకోవాలంటే తాను ఇంటిలో ఫ్రెండ్స్‌తో కూర్చున్నపుడో, ఊరికే కూర్చున్నపుడో వచ్చి వినాలని, మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషలో శత్రువును తిడుతూ ఉంటానని చెప్పారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను నెహ్రూతో రాజీపడ్డానని కొందరు తనపై అపనిందలు వేశారని రాధా అన్నారు. వైఎస్ హయాంలో నెహ్రూ హైదరాబాద్‌లో చేజిక్కించుకున్న స్థలాన్ని వంశీ, నానిలతో కలిసి కొనుగోలు చేయాలని ప్రయత్నించారన్న ఆరోపణలను రాధా కొట్టిపారేశారు. విజయవాడలో రాణిగారితోటలో 1,800 మందికి పట్టాలు ఇప్పించినా ఓడిపోవటానికి కారణమేమిటన్న ప్రశ్నకు బదులిస్తూ, తాను పట్టాలు ఇప్పించాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పించానని, ఓట్లు వేయటం వాళ్ళ ఇష్టమని అన్నారు. రెండు సార్లు ఓడిపోవటానికి తన వ్యవహారశైలిలోనే ఏదో లోపం ఉండిఉండొచ్చని చెప్పారు. దురదృష్టం, ఇతరులు బురద జల్లటం కూడా కారణాలని అన్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతమంది ఒక కమిటీలాగా ఏర్పడి తనను నియంత్రించటానికి ప్రయత్నించారని, ఒకటి రెండు సంవత్సరాలు వారి వేధింపులకు గురయ్యానని, తర్వాత వారి మాటను వినటం మానేశానని, దానితో వారు తనపై బురద జల్లటం ప్రారంభించారని రాధా చెప్పారు.
తాను బ్యాలెన్స్ కోల్పోతే కులఘర్షణలు వస్తాయని, అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తానని రాధా అన్నారు. తనపై అంచనాలు విపరీతంగా ఉన్నాయని, వాటిని తాను చేరుకోలేకపోవటం నిజమేనని చెప్పారు. రంగా స్థాయికి చేరుకోలేనని, రంగా కుమారుడిగా లభిస్తున్న గుర్తింపు చాలని అన్నారు. రంగా హత్యకేసులో దోషులకు శిక్షపడకపోవటానికి కారణం కొందరు రాజీ పడ్డారని, మరి కొందరు లాలూచీ పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఈ కేసులో న్యాయం జరగకపోవటానికి కారణం దురదృష్టమే కారణమని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు తిరగతోడటానికి ఎందుకు ప్రయత్నించలేదని అడగగా, దానివలన తన తండ్రి తిరిగిరాడని చెప్పారు.