విజయవాడ సెంట్రల్ టిక్కెట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని భావిస్తున్న వంగవీటి రంగా తనయుడు… మొదటి సారి తన చేతల ద్వారా.. వైసీపీపై వ్యతిరేకతను ప్రదర్శించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. జగన్ సెంట్రల్ లో పని చేసుకోమని.. వంగవీటి రాధాకు సూచించారు. దాని ప్రకారం.. ఆయన అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో మల్లాది విష్ణును పార్టీలో చేర్చుకుని ఆయనకే నియోజకవర్గ పదవి ఇచ్చారు. దీనిపై వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఆయన విజయవాడ తూర్పు లేదా.. మచిలీ పట్నం పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని … వైసీపీలోని కొంత మంది నేతలు రాయబారం చేసినా… జగన్ మాత్రం మాట్లాడలేదు. దీంతో.. వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిలో ఉన్నారు.
అప్పటి నుంచి మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు వంగవీటి రాధాకృష్ణ. బయటకు రాలేదు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన అనుచరులుకూడా.. వైసీపీ జెండాలను తీసేశారు. తాజాగా ఈ రోజు వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమంలోనూ ఎక్కడా వైసీపీ ప్రస్తావన రాలేదు. కనీసం వైసీపీ జెండాలు కూడా పెట్టుకోలేదు. రంగా స్వగ్రామం కాటూరులో మూడు ఎకరాలలో రంగా పేరుతో స్మృతి స్థూపం నిర్మిస్తున్నారు. దీనికి శంకుస్థాపన అక్కడా పార్టీ ప్రస్తావన తీసుకు రాలేదు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎక్కడా వైసీపీ జెండా కనిపించలేదు.
వంగవీటి రంగాకు ఇస్తామన్న విజయవాడ తూర్పు టిక్కెట్ ను.. యలమంచిలి రవికి, మచిలీపట్నం పార్లమెంట్ టిక్కెట్ ను వల్లభనేని బాలశౌరికి జగన్ ఖరారు చేశారు. వారిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే… జగన్మోహన్ రెడ్డి.. వంగవీటి కోసం ఒక్క టిక్కెట్ కూడా రిజర్వ్ చేయలేదు. దీంతో వంగవీటి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.