గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చే ఇది. వంగవీటి రాధా నెమ్మదిగా తెలుగుదేశం వైపు అడుగులు వేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఇప్పటికే ఆయన్ని కొంతమంది టీడీపీ నేతలు కలిశారనీ, పార్టీలోకి ఆహ్వానించారనీ వార్తలొచ్చాయి. అంతేకాదు, ఈ నెల 22 లేదా ఆ మార్నాడు వంగవీటి రాధ పచ్చ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారు అయిపోయినట్టు కూడా మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా సంస్థకు వంగవీటి రాధ ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ మారుతున్నారా లేదా అనే సూటి ప్రశ్నకు… సూటిగా ఆయన స్పందించకపోయినా, తాను తీసుకోబోతున్న నిర్ణయం ఎలా ఉండబోతోందనే సంకేతాలు మాత్రం ఇచ్చేశారు.
తాను పార్టీ మారాలనుకుంటే తొందరపడననీ, పక్కాగా ప్రణాళికలు వేసుకున్నాకనే నిర్ణయం తీసుకుంటానని రాధ అంటున్నారు. టీడీపీలో చేరమంటూ తనను నేరుగా ఎవ్వరూ సంప్రదించలేదని చెబుతూనే… ఆ పార్టీలోని కొంతమంది ప్రముఖ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయనీ, వాటిని రాజకీయేతర సంబంధాలుగా చూడాలని చెప్పుకొచ్చారు. పార్టీ తరఫున వైకాపా నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలు హాజరౌతున్నానని చెప్పడం విశేషం. అలాంటప్పుడు పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలను ఎందుకు ఖండించడం లేదని అడిగితే… తనకు సంబంధం లేని వార్తలపై స్పందించాల్సిన అవసరం ఏంటని రాధా చెప్పారు. వంగవీటి రాధ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతోందనేది ఆయన మాటల్లో చాలా స్పష్టంగా వినిపిస్తోంది.
పార్టీ మార్పుపై వస్తున్న కథనాలను ఆయన ఖండించను అంటున్నారు. వైకాపా నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం లేదనీ చెప్తున్నారు! రాజకీయేతరమే అయినా టీడీపీ నేతలతో సంబంధాలున్నాయనీ చెబుతున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీ మారతాననీ చెబుతున్నారు. కాకపోతే ఇవన్నీ సూటిగా చెప్పలేదు.. అంతే! మొత్తానికి, వైకాపాకు ఆయన దూరం కాబోతున్నారనేది దాదాపు స్పష్టంగానే ఉందని ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ వైపే వెళ్తారనేది కూడా అర్థమౌతున్న విషయమే. ఎందుకంటే, ఎలాగూ టీడీపీ కూడా కులాల వారీ రాజకీయాలు చేస్తోంది కదా! రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గనేతల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకోపక్క కాపు సామాజిక వర్గాన్ని కూడా మెల్లగా మరింత దగ్గర చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఆ కోణం నుంచి వంగవీటి కుటుంబం టీడీపీలో ఉంటే వారికీ కొంత మేలే కదా! సో… ప్రస్తుతం ‘పార్టీ మార్పు అనే ప్రక్రియ’లో వంగవీటి రాధా రెండో దశలో ఉన్నారని చెప్పుకోవాలి. మొదటి దశ పుకార్లు రావడం, రెండో దశపై వాటిపై స్పందించినా సదరు నాయకుడు ఖండించకపోవడం, కార్యకర్తలూ అనుచరుల డిమాండ్ కు అనుగుణంగా పార్టీలో చేరడం చివరి దశ! వంగవీటి ప్రయాణం కూడా ఈ లెక్కల్లోనే సాగుతోంది అనిపిస్తోంది. ఈ క్రమంలో అనూహ్యమైన మార్పులకు దారితీసే ప్రయత్నాలు వైకాపా నుంచి ఉంటాయో లేదో చూడాలి.