ఎన్నికలకు ముందు కోస్తాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తన తండ్రి వంగవీటి రంగాను అవమానించడమే కాకుండా.. తనను హేళనగా మాట్లాడిన.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కృషి చేయాలని… వంగవీటి రాధా పట్టుదలగా ఉన్నారు. వైసీపీ ఆయన రాజీనామా చేసిన వెంటనే తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ సోషల్ మీడియాలో.. వ్యతిరేక ప్రచారం జరగడంతో.. అప్పటికి ఆగిపోయారు. ఎమ్మెల్సీ ఇస్తామని.. చంద్రబాబు చెప్పినా.. పదవి కోసం… చేరినట్లుగా ఉండకూడదన్న ఉద్దేశంతో.. పదవిని నిరాకరించారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాధా నాలుగు రోజుల క్రితం విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను కలుసుకుని చర్చలు జరిపారు. చర్చల సారాంశం ఏమిటో కానీ.. సీఎంను కలిసి పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.
చంద్రబాబుతో భేటీలో తాను తెలుగుదేశం తరపున ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నానని, రాధా చెప్పారు. పార్టీలో చేరి ప్రచారం చేయమన్నా చేస్తానని, తనకు ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం రాధాను ముందు పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. రాధాకు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలలో ఆయనను నిలబెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అది ఎక్కడి నుంచి అన్నదానిపై… ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ విషయం చంద్రబాబుకు వదిలేశానని.. ఎక్కడి నుంచి పోటీ చేయమంటే.. అక్కడ్నుంచి పోటీ చేస్తానని… వంగవీటి రాధా తన సన్నిహితులకు చెబుతున్నారు.
వంగవీటి రాధాను… రాష్ట్రం మొత్తం.. ప్రభావం చూపేలా ఉపయోగించుకోవాలని.. టీడీపీ అధినేత ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు కార్పోరేషన్ ఏర్పాటు చేసి నేటి వరకు నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఇవ్వడమే కాకుండా విదేశీ విద్యోన్నతి పధకం కింద అనేక మంది కాపు విద్యార్దులును విదేశాలకు పంపామని, తాను ఇచ్చిన హామీ మేరకు విద్య, ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన విషయాన్ని రాధా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికలలో పోటీ చేయని పక్షంలో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పదవి ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాధా రాక.. టీడీపీకి అడ్వాంటేజ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.