గోదావరి జిల్లాలోని దిండి లో జరుగుతున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలను బట్టి, రేపోమాపో వంగవీటి రాధా జనసేన లో చేరడం ఖాయమన్న రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
దిండి లో ఈరోజు జరుగుతున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. రాపాక వరప్రసాద్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ సమావేశాల నిర్వహణ పర్యవేక్షిస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధా ఈ సమావేశాలు జరుగుతున్న స్థలానికి వచ్చి అక్కడ జనసేన నాయకులతో చర్చలు జరపడం ఆసక్తి కలిగించింది. నాదెండ్ల మనోహర్ తో కలిసి వంగవీటి రాధా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వంగవీటి రాధా మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. కాసేపట్లో దిండి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ తో ఇవాళ రాత్రికి వంగవీటి రాధా భేటీ కాబోతున్నారు అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ చర్చ లు సఫలం అయితే రేపు రాధా జనసేన కండువా కప్పుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
వంగవీటి రాధా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పని చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరినా, జగన్ వ్యవహారశైలి నచ్చక ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ సీపీ నుండి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అయితే ఆయన అభిమానులు ఎప్పటి నుండో ఆయనను జనసేన లో చేరమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గతంలో పలుమార్లు ఇవే తరహా రూమర్లు వచ్చినప్పటికీ అవి నిజ రూపం దాల్చలేదు. మరి ఈ సారి ఏమవుతుందో వేచి చూడాలి.