వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరికకు ముహూర్తం ఖరారైంది. 25వ తేది సాయంత్రం వంగవీటి రాధా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోబోతున్నారు. ఆయనను టీడీపీ నేతలు ఇంటికి వెళ్లి మరీ.. టీడీపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. వారితో రాధా సానుకూలగా స్పందించారు. చంద్రబాబు గౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి.. ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ టీ.డీ. జనార్ధన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు వంగవీటి నివాసానికి వెళ్లి చంద్రబాబు సందేశాన్ని వివరించారు. వంగవీటి కూడా.. తన ఆలోచనను వారికి చెప్పారు. దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రోజు.. ప్రెస్మీట్ పెట్టి.. వంగవీటి అసలు విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనపై అడుగడుగునా ఆంక్షలు విధించడాన్ని రాధాకృష్ణ బహిరంగంగానే వ్యతిరేకించారు. తన తండ్రి విగ్రహం సాక్షిగా తనను సోదరుడిలాగా చూసుకుంటానని చెప్పిన జగన్ .. అవమానాల పాలు చేశారని.. వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. ఆయనను.. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడి, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. అయితే… రెండు పదవుల నుంచి కనీస సమాచారం ఇవ్వకుండానే… వేర్వేరుగా తొలగించారు. చివరికి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడటంతో ఆయన.. ఇతర పార్టీల వైపు చూశారు. రాధాతో దాదాపుగా నెల రోజుల నుంచి టిడిపి నేతలు టచ్ లో ఉన్నారు. త్వరలో వచ్చే ఖాళీల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టిడిపి నుంచి రాధాకు హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. రాధా- రంగా మిత్రమండలి సభ్యులందరూ రాధా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా…తాము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
చంద్రబాబు సాదరంగా ఆహ్వానించడమే కాకుండా, తనకు తగిన గౌరవం ఇస్తామని చెప్పడంతో రాధా అనుచరులతో ఈ విషయాలన్నీ చెప్పారు. వారంతా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. రాధాతో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలుపొందిన ఐదుగురు కార్పోరేటర్లు కూడా టిడిపిలో చేరుతున్నారు. వైసిపి డివిజనల్ అధ్యక్షులు, మాజీ కార్పోరేటర్లు, వంగవీటి రంగా అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోబోతున్నారు.