వంగవీటి రాధాను గౌరవించుకుంటామని మంచి పదవి ఇస్తామని ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంతో ఎమ్మెల్సీ ఖాళీ అవ్వగానే ఆ స్థానాన్ని వంగవీటి రాధాతో భర్తీ చేసి మంత్రిని చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ పదవిలోకి నాగబాబు వస్తున్నారు. రాజ్యసభ సీటు సమీకరణాల్లో కుదరకపోవడంతో ఆయనను మంత్రిని చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో వంగవీటి రాధాను చంద్రబాబు పిలిపించుకున్నారు. దాదాపుగా అరగంట సేపు ఆయన సచివాలయంలో చంద్రబాబుతో మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది స్పష్టత లేదు కానీ ఆయనకు ఏ అంశాలపై ఆసక్తి ఉందో.. ఏ పదవి ఇవ్వాలనుకుంటున్నారో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవులు త్వరలో కొన్ని ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వంగవీటి రాధాకు ఇచ్చిన కేబినెట్ హోదా ఉండే నామినేటెడ్ పదవి ఇస్తారని చెబుతున్నారు.
వంగవీటి రాధా 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. అమరావతి ఉద్యమానికి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జగన్ బంపర్ ఆఫర్లు పంపించారు. ఆయన మిత్రులు కొడాలి నాని, వంశీ చాలా ఒత్తిడి చేశారు. అయినా వంగవీటి రాధా మాత్రం మనసు మార్చుకోలేదు. టీడీపీ కోసం ప్రచారం చేశారు. ఆయనకు మంత్రి స్థాయిలో పదవులు ఇస్తేనే సముచితమన్న భావన టీడీపీ క్యాడర్ లో ఉంది.