ఈరోజుల్లో, ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారండీ..? పదవి మీద ఆశ కోసమో, దానితోపాటు మరిన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయన్న లెక్కలతోనే కదా! అంతేగానీ.. ప్రజలకు సేవ చేసెయ్యాలనీ, పుట్టిన గడ్డ రుణం తీర్చేసుకోవాలనీ పాలిటిక్స్ లోకి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు..? ఒకవేళ అలాంటి ఉద్దేశం మనస్ఫూర్తిగా ఉన్నవారు రాజకీయాలవైపు రాలేని పరిస్థితి ఉంది. ప్రజాసేవ అనేది స్వచ్ఛంద సంస్థల బాధ్యతగానో, కొంతమంది వ్యక్తిగత వ్యాపకాలుగానో మారిపోయింది. రాజకీయ నాయకులు ప్రజాసేవ చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కూడా రానురానూ సన్నగిల్లుతోంది. ఇంతకీ ఇప్పుడీ చర్చ ఎందుకొచ్చిందంటే… తెలుగుదేశం పార్టీలోకి ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ చేరబోతున్నారు. తాను రాజకీయాల్లోకి ఎందుకొస్తున్నానూ అనే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు విన్నాక, ఇదిగో ఇలాంటి అభిప్రాయాలే మనకు కలుగుతాయి!
ఓ మీడియా సంస్థతో వాణీ విశ్వనాథ్ మాట్లాడుతూ… తెలుగువారి ఆదరాభిమానాలు కారణంగానే తాను ఎంతో ఎదిగానని ఆమె అన్నారు. అలాంటి తెలుగువారి కోసం ఏదో చేయాలని చాలా కాలం నుంచీ అనిపిస్తోందనీ, ఇన్నాళ్లకు అవకాశం వచ్చిందని వాణీ విశ్వనాథ్ చెప్పారు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా అభిమానమని అన్నారు. ఇప్పుడు దక్షణ భారతదేశమంతా ఆయన గురించే మాట్లాడుకుంటోందనీ, ఆయన దూరదృష్టి, నాయకత్వ పటిమ గురించే చర్చ జరుగుతోందని ఆమె వివరించారు. త్వరలోనే అమరావతి వెళ్లి, తెలుగుదేశం పార్టీలో చేరి, తెలుగువారికి సేవ చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం! తెలుగుదేశం పార్టీకి ఒక మహిళా నాయకురాలు అవసరం. ఎందుకంటే, వైకాపా ఎమ్మెల్యే రోజాకు పోటీగా ఎవర్నో ఒకర్ని పెట్టాలని ఎప్పట్నుంచో పార్టీలో జరుగుతున్న చర్చ. ఇప్పటికే రోజాను ఎదుర్కొనేందుకు ఒకరిద్దరు మహిళా నేతలు ప్రయత్నిస్తున్నా… సినీ గ్లామర్ కూడా తోడైతేనే బాగుంటుందనేది వారి అంచనా! సో.. తెలుగుదేశం పార్టీకి ఉన్న అవసరం ఇది. వాణీ విశ్వనాథ్ కు ఉన్న అర్హత కూడా సినీ నేపథ్యమే. అంతేగానీ, ఆమె ఏదో ప్రజాసేవ చేసేస్తారని ప్రకటించగానే… ‘మా పార్టీలో చేరి ఆ మహత్కార్యాన్ని చేస్తూ మమ్ములను తరింపజేయుడి’ అంటూ వెంపర్లాడే పరిస్థితి లేదక్కడ! సరే.. ఇప్పుడు వాణీ విశ్వానాథ్ విషయానికే వద్దాం! తన అభివృద్ధికి కారకులైన తెలుగు ప్రజలకు ఏదో చేయాలని, ఎప్పట్నుంచో అనిపిస్తూ ఉంటే.. ఇన్నాళ్లూ ఏం చేసినట్టు..? ప్రజాసేవ చేయాలంటే రాజకీయ పార్టీల వేదికలు కావాలా..? ఏదో ఒక పార్టీ నుంచి పిలుపు వస్తే తప్ప… సో కాల్డ్ సేవలూ రుణాలు తీర్చుకోవాలనే గురుతర బాధ్యతలు గుర్తు రావా..? టీడీపీ ఆహ్వానించిందనో, లేదా ఎప్పట్నుంచో పాలిటిక్స్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నానో చెబితే చాలు కదా! ఈ సేవలూ రుణాలూ ఎందుకు..? ఇంకా ఈ ముసుగులు ప్రజలకు అర్థం కావని అనుకుంటే ఎలా..?