మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరతారని ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి తనకు నచ్చిందనీ, అందుకే తెలుగుదేశంలో చేరి ప్రజాసేవ చేసుకోవాలనే ఆశను ఆమె కొన్నాళ్ల కిందటే బయటపెట్టారు. అదిగోఇదిగో అంటూ కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వాణీ కలవబోతున్నారు. పార్టీ చేరాలనే తన ఆకాంక్షను సీఎం దగ్గర వ్యక్తీకరించబోతున్నారు. అయితే, వాణీ చేరికకు కొంత ఆలస్యం ఎందుకు అయిందనే అంశంపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో ఓ ఆసక్తికరమైన కథనం ప్రసారం అయింది! టీడీపీలో చేరేందుకు కావాల్సిన అర్హతలన్నీ ఆమెకి ఉన్నాయా లేదా అనేది పార్టీ పరీక్షించినట్టు చెప్పారు. మహిళా నేతలకు తెలుగుదేశం ఖార్ఖానా అన్నట్టుగా అభివర్ణించారు. సినిమా నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి తెలుగుదేశం పార్టీయే తొలి ఎంపికగా ఉందన్నారు!
టీడీపీలో మహిళా నేతలకు కొదువ లేకపోయినా, ప్రతిపక్ష మహిళా నేతల నుంచి ఎదురౌతున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే వారికి పదవులతో సహా అనేక పరిమితులు ఉంటున్నాయట! ఈ నేపథ్యంలో బాగా దూకుడుగా ఉండే ఓ మహిళా నేత కోసం టీడీపీ కొన్నాళ్లుగా అన్వేషించిందట. ఆ అన్వేషణ వాణీ విశ్వనాథ్ దగ్గర ఆగిందని ఆ కథనంలో చెప్పారు. అంతేకాదు, వాణీ విశ్వనాథ్ రాజకీయ ఆసక్తిని కొన్నాళ్లుగా టీడీపీ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయట. రాజకీయాల పట్ల అవగాహన, ప్రజా సమస్యలపై వాణీ స్పందిస్తున్న తీరు టీడీపీ నాయకులను ఆకర్షించాయని చెప్పారు. అందుకే, ఆమె సేవల్ని టీడీపీకి ఉపయోగించుకోవాలని నాయకత్వం దాదాపు నిర్ణయించుకుందట. ఉదారంగా ఆమెకో అవకాశం ఇచ్చి ప్రోత్సాహించాలని భావిస్తోందని చెప్పారు. అంతేనా.. ఆమెకు ఏ పదవితో ఆహ్వానం పలకాలనే చర్చ పార్టీలో జరుగుతోందట. తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి ఇచ్చి ఆమెని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుంది కొంతమంది అభిప్రాయపడుతున్నట్టుగా ఆ కథనంలో చెప్పారు.
చూశారా.. టీడీపీలో వాణీ విశ్వనాథ్ చేరికకు ఇస్తున్న ప్రాధాన్యత! ఆమె రాజకీయ ఆసక్తినీ, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరును టీడీపీ పెద్దలు ఇన్నాళ్లూ గమనించారట. నిజానికి, ఆమెలో రాజకీయ ఆసక్తి పుట్టి కొన్ని నెలలేగా అయింది. ఈలోగా వారికి వాణీలోని రాజకీయ జ్ఞానం ఎలా కనిపించేసిందో తెలీదు! ఇక, ప్రజా సమస్యలపై ఆమె స్పందించిన తీరు కూడా టీడీపీని ఆకర్షించిందట! ప్రజా సమస్యలపై ఆమె ఎప్పుడు స్పందించారు..? ఎక్కడ స్పందించారు..? ఎలా స్పందించారు..? ఏమో, వాణీలో ఈ అవ్యక్త కోణాన్ని చూడగలిగే దివ్యద్రుష్టి టీడీపికి ఉందేమో! టీడీపీలోకి పరమానస ప్రవేశం చేయగలిగే శక్తి సదరు మీడియాకే ఉందేమో! మొత్తానికి, ఈ ప్రెజెంటేషన్ ఎలా ఉందంటే, టీడీపీ అన్వేషిస్తున్న నాయకురాలు దొరికేసినట్టు, రాజకీయావగాహన, ప్రజా సమస్యలపై స్పందించగలిగే దూకుడైన నాయకురాలే వస్తోందని టీడీపీ శ్రేణులకు చెబుతున్నట్టుగా ఉంది. పార్టీ అవసరాన్ని, వాణీ విశ్వనాథ్ కు ఇస్తున్న అవకాశంగా భలేగా చెప్పారు కదా! ఈ రెంటి మధ్యా వాణీ అర్హతలను పెంచడం అనే కోణం ఉంది చూశారూ… ప్చ్!