వాణీ విశ్వనాథ్. నిన్నటి తరం ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ఘరనా మొగుడు, కొదమ సింహం లాంటి సినిమాల తో తెలుగు ప్రేక్షకులని అలరించిన హీరోయిన్. అగ్ర హీరోయిన్ స్థాయికి తెలుగులో ఎదగపోయినా చాలా సినిమాల్లో, అందులోనూ కుటుంబ కథా చిత్రాల్లో నటించి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగ దగ్గరైన నటి. అనేక భాషల్లో నటించిన ఈవిడ ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతోంది.
తనకు టిడిపి నుంచి ఆహ్వానం వచ్చిందనీ, త్వరలోనే చంద్రబాబు ని కలుస్తానని చెప్పిన వాణీ విశ్వనాథ్, ఏపి లో పాలన బాగుందని, రాముడు పరిపాలిస్తునట్టుగా ఉందనీ బాబుకి కితాబిచ్చింది. ఐతే ఒకప్పుడు టిడిపి లో ఉండి ఇప్పుడు వైసిపి లో ఉన్న ఫైర్ బ్రాండ్ రోజా ని కట్టడి చేయడానికి ఈమెని తీసుకొచ్చారేమోనన్న సందేహాలు కొంతమందికి ఉన్నాయి. అయితే వాణీ విశ్వనాథ్ మాత్రం రోజా మంచి నటి అని ప్రశంసించింది. కానీ పార్టీ ఆదేశిస్తే రోజా పై పోటీ కి సిద్దం అని ప్రకటించింది.తెలుగు ప్రజలు సినిమాల్లో ఆదరించినట్టుగానే తనని రాజకీయాల్లోనూ ఆదరించమని విఙ్ఞప్తి చేసింది.
స్వతహాగా మళయాళీ అయిన నలభై ఆరేళ్ళ ఈ నటి గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రజలతో పెద్దగా టచ్ లో లేరు. ఇటీవల వచ్చిన జయజానకినాయక లో చిన్న పాత్ర పోషించి రీ-ఎంట్రీ ఇచ్చారు. మరి ఎంతవరకు రాజకీయాల్లో, టిడిపిలో సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
కొసమెరుపు: వాణీ విశ్వనాథ్ తండ్రి పెద్ద జ్యోతిష్కుడు. వాణీ విశ్వనాథ్ 13 యేళ్ళ వయసులోనే ఆయన ఆమె గురించి జోస్యం చెప్పాడట – తాను సినీరంగం లో గొప్ప నటి అయి భవిష్యత్తు లో రాజకీయాల్లోకి కూడా వస్తుంది అని!!