షూటింగ్‌లు లేక ఖాళీగా ఉన్నారేమో కానీ… వనితా విజయ్‌కుమార్ మూడో పెళ్లి చేసుకోవడాన్ని తమిళ చిత్ర సీమలోని నటీనటులు పెద్ద సమస్యగా భావిస్తూ కామెంట్లు చేసేస్తున్నారు. దీంతో… దూకుడైన స్వభావంతో ఉండే వనిత కూడా.. వారందరితో ఢీ అంటే.. ఢీ అంటున్నారు. ఇతరులు ఒక్క మాట అంటే.. వనిత నాలుగు మాటలు అంటున్నారు. దీంతో ఈ వివాదం అగ్గి రాజుకున్నట్లుగా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు ఈ వివాదంలో చేరిపోతున్నారు. తాజాగా… తనకు సంబంధం లేకపోయినా… నయనతార వివాదంమలోకి తీసుకు వచ్చి వనిత… ఈ వివాదం రేంజ్‌ను పెంచేశారు.
కొద్ది రోజుల క్రితం… పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ నటుడు విజయ్ కమార్ పెద్ద కుమార్తె అయిన వనిత.. అంతకు ముందు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారితో సరిపడలేదు. విడాకులు తీసుకున్నారు. నిజానికి వనితకు.. తన తండ్రితో కూడా సత్సంబంధాలు లేవు. ఆయనతో ఆస్తి కోసం గొడవలు కూడా పడుతున్నారు. కోర్టులు.. కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు.. మూడో పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా.. క్రిస్టియన్ పద్దతిలో చేసుకున్న పెళ్లిలో పిల్లల సమక్షంలో.. పీటర్‌పాల్‌తో ముద్దులు కూడా పెట్టుకోవడంతో పెళ్లి వైరల్ అయింది.
అయితే.. పీటర్ పాల్ అనే వ్యక్తి తన భార్యకు విడాకులివ్వకుండానే వనితను పెళ్లి చేసుకుందని.. మొదట నటి కస్తూరి విమర్శలు ప్రారంభించారు. కస్తూరికి.. వనిత కౌంటర్ ఇచ్చారు. కరోనా తప్ప మరో టాపిక్ లేకపోవడంతో.. ఈ వివాదాన్ని తమిళ టీవీ చానల్స్ అందిపుచ్చుకున్నాయి. అప్పటి నుంచి షో ప్రారంభమయింది. బతుకు జట్కాబండి లాంటి కార్యక్రమానికి.. ఓ టీవీ చానల్.. వనితను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లక్ష్మిరామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు. షోకు వచ్చిన వనిత.. లక్ష్మీ రామకృష్ణన్ తో గొడవ పెట్టుకున్నారు. నువ్వేమైనా పతివ్రవతా అని ప్రశ్నించి.. ఆమె బాగోతం అంతా బయటపెడతానని హెచ్చరించారు. ఇలా ప్రతి ఒక్కరికీ వనిత కౌంటర్ ఇస్తోంది. విమర్శలు చేసే వాళ్లు పెరిగిపోతూనే ఉన్నారు.
తాజాగా..తనపై వస్తున్న విమర్శలన్నింటికీ సమాధానంగా.. వనిత .. నయనతార పేరును తీసుకు వచ్చారు. గతంలో ప్రభుదేవ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవ భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా? అప్పుడు కనీసం మాట కూడా మట్లాడలేని వారు ఇప్పుడెందుకింత రచ్చ చేస్తున్నార`ని వనిత సోషల్ మీడియాలో ప్రశ్నించింది. కొన్ని అసభ్యకర పదాలను కూడా తన ప్రశ్నల్లో వాడింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. చివరికి వనిత తన ట్వీట్లను డిలీట్ చేసుకుంది కానీ… మంట మాత్రం.. ఆరే చాన్స్ కనిపించడం లేదు.
సినీ పరిశ్రమలోని వారి వ్యక్తిగత జీవితాలపై ఇతరులకు ఆసక్తి కరంగానే ఉంటుంది. అందరి లాగే వారి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎవరి జీవితం వారిది. ఒకరి జీవితం గురించి మరొకరు జడ్జ్ చేసే పరిస్థితి రావడంతోనే వివాదాలొస్తున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అదే జరుగుతోంది. చివరికి ఎంత మంది రహస్య జీవితాలు వెలుగులోకి వస్తాయో..?