టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను… హరీష్ రావు ఓడించాలనుకుంటున్నారా..? అవసరమైన ఆర్థిక సాయం కూడా… కాంగ్రెస్ అభ్యర్థికి చేస్తానన్నారా..?. అవుననే అంటున్నారు… గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్ శుక్రవారం తనకు ఓ ప్రైవేట్ ఫోన్ నుంచి ఫోన్ చేసి కోరారంటున్నారు. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో తనకు రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్ చెప్పినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారట. ఆర్థికసాయం అందిస్తానని హరీశ్ చెప్పారని.. అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానన్నారు. తనకు గజ్వేల్ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు.
ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు టీఆర్ఎస్ కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా… హరీష్ రావును.. టీఆర్ఎస్ వ్యవహారాల్లో దూరం పెడుతున్నారు. కొన్నాళ్ల పాటు.. హరీష్ రావు కార్యక్రమాలు.. టీఆర్ఎస్ సొంత మీడియాలో కూడా రాలేదు. అయినా హరీష్ రావు.. టీఆర్ఎస్ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. గజ్వేల్ బాధ్యతలను నిన్నామొన్నటి వరకూ ఆయనే చూశారు. అయితే .. వరసుగా.. టీఆర్ఎస్ నేతలంతా.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూండటంతో… కేసీఆర్ కొత్తగా.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ కు పంపించారు. ఇప్పుడు గజ్వేల్ బాధ్యతలు… కొత్త ప్రభాకర్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా… మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గజ్వేల్ లో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది.
హరీష్ రావును దూరం పెడుతూండటానికి కారణం.. ఫోన్ ట్యాపింగ్ లో రహస్యాలు ఏవో బయటకు వచ్చాయన్న ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఇప్పుడు నేరుగా… ప్రతాప్ రెడ్డినే కేసీఆర్ ను ఓడించడానికి హరీష్ ప్రయత్నిస్తున్నారనే చెప్పడం… కలకలం రేపుతోంది. ఇది నిజమో కాదో కానీ.. హరీష్ రావుకు మాత్రం మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే హరీష్ కోసం… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రతాప్ రెడ్డి.. హరీష్ పై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ చేశారు. నిరూపిస్తే ప్రాణత్యాగం చేసుకుంటానన్నారు. నిరూపించలేకపోతే.. ఏం చేసుకుంటావో చెప్పాలన్నారు. కానీ ఈ సవాళ్లు సెకండరీనే… ప్రతాప్ రెడ్డి చెప్పినవే.. జనం లోకి వెళ్లి పోయాయి.