గజ్వేల్ లో కేసిఆర్ మీద పోటీ చేసిన వంటేరు ప్రతాపరెడ్డి ఎన్నికల ముందు చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికలకు ముందు ప్రతాప్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దాన్ని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. అలాగే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తనను వేధిస్తున్నారని ప్రతాపరెడ్డి పలుమార్లు కేసిఆర్ ఫై విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో సోదాల పేరిట పోలీసులు ప్రతాపరెడ్డి ఇంటి పైకి రావడంతో అక్కడ ఒంటి మీద పెట్రోలు తో మీడియా కి కనిపించిన ప్రతాపరెడ్డి, తాను ఆత్మహత్యా యత్నానికి పాల్పడ లేదని, తన పై పోలీసులే పెట్రోల్ పోశారని, తన హత్యకు కే సిఆర్ కుట్ర చేశారని ఆరోపించిన సంగతి కూడా తెలిసిందే.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. వంటేరు ప్రతాపరెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరబోతున్నాడు. రేపు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ప్రతాపరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కేసిఆర్ మీద పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నప్పటికీ, కెసిఆర్ ని, టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడంలో చూపించిన ప్రతాపరెడ్డి ఎట్టకేలకు టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే.