శరత్‌కుమార్ తనయ వరలక్ష్మి… తెలుగువాళ్లకీ పరిచయమే. ఈమధ్య విడుదలైన `పందెం కోడి 2`లో ప్రతినాయకురాలిగా నటించింది. ఇప్పుడు `సర్కార్`లోనూ ఓ కీలకమైన పాత్ర పోషిస్తోంది. విశాల్ తో వరలక్ష్మి ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంది వరలక్ష్మి. అయితే తాజాగా రాజకీయాలపై ఓ నిర్ణయం తీసుకుంది వర. త్వరలో రాజకీయాల్లోకి వస్తా… అంటూ ఓ ప్రకటన చేసింది.
”మహిళలలో చైతన్యం అవసరం. సమాజానికి ఏదో ఒకటి చేయగల నేర్పు వాళ్లకు ఉంది. నాకూ ఏదైనా చేయాలనిపిస్తుంటుంది. అందుకోసం రాజకీయాల్లోకి వస్తాను. అయితే ఇప్పుడు కాదు. దానికి సమయం ఉంది. కనీసం అయిదేళ్లయినా ఆగాలి. దర్శకత్వం వైపు కూడా మనసు లాగుతోంది. త్వరలో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తా. ఈలోగా సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ నేర్చుకుంటా“ అంటోంది వరలక్ష్మి. విశాల్‌తో అనుబంధం గురించి మాట్లాడితే.. “విశాల్ నాకు స్నేహితుడు మాత్రమే. మేమిద్దరం చాలా విషయాల్ని చర్చించుకుంటాం. కానీ మామధ్య ఎప్పుడూ ప్రేమ, పెళ్లి ప్రస్తావన రాలేదు“ అని క్లారిటీ ఇచ్చేసింది. శరత్ కుమార్ సినిమాల్లో రాణించి, ఆ తరవాత రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. మరి వారసురాలు ఏమాత్రం ప్రభావితం చేస్తుందో చూడాలి.