సినిమా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబో మహేష్ బాబు – రాజమౌళి. సూపర్ స్టార్‌తో జక్కన్న ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడో అని అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తగినంత టైమ్ తీసుకొంటున్నారు. మహేష్ సైతం ఎక్కడా కంగారు పడడం లేదు. రాజమౌళి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా వర్క్ షాపులు జరుగుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ కథ వారణాసి నేపథ్యంలో మొదలవుతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ తరవాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఓ సెట్ లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ తీర్చిదిద్దుతున్నారు. తొలుత ఇక్కడ షూటింగ్ ప్రారంభించి, ఆ తరవాత సౌత్ ఆఫ్రికా వెళ్తారు. అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే దట్టమైన అటవీ ప్రాంతాలున్న ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. ఏయే సన్నివేశాలు ఎక్కడెక్కడ షూట్ చేయాలి అనే విషయంపై ఓ అంచనాకు సైతం వచ్చారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇండోనేషియాకు చెందిన ఓ కథానాయికని ఈ సినిమా కోసం ఎంచుకొందామనుకొన్నారు. ఆమెపై ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.