తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పడిన వారు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. వారి బాట వైసీపీనే. వెళ్లే వాళ్లు వెళ్లకుండా.. వారు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. లోకేష్‌తో పోల్చి.. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అంటున్నారు. నర్మగర్భంగా.. మరికొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో.. వారి వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా.. అన్న అభిప్రాయం బలపడిపోతోంది. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి.. వర్ల రామయ్య.. తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని తేల్చేశారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయకత్వం చాలా స్ట్రాంగ్‌గా ఉందని.. జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదన్నారు.
2009లో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. మధ్యలో… ప్రమాదానికి గురయ్యారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కూడా.. టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు. చంద్రబాబుతో విబేధాలు కూడా వచ్చాయని ప్రచారం జరిగింది. అనేక మార్లు.. టీడీపీ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. కట్టే కాలే వరకూ.. తనది టీడీపీనేనని చెప్పుకొచ్చేవారు. అయితే.. ఆయన సన్నిహితులు వరుసగా.. వైసీపీకెళ్లిపోతున్నారు. తాను అన్నా..అన్న అని పిలిచే కొడాలి నాని చాలా కాలం క్రితమే వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ బాటపట్టారు. వారు.. జూనియర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు.
ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామ.. చంద్రబాబుకు కూడా.. దగ్గరి బంధువు అయిన నార్నె శ్రీనివాసరావు జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరిపోయారు. దీంతో.. ఎన్టీఆర్‌పై.. టీడీపీలో ఓ రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే వర్ల రామయ్య మాటల్లో బయట పడినట్లయింది. ఈ వివాదం పెద్దయితే.. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించక తప్పదు. అయితే.. జూనియర్ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి..!