రామ్ గోపాల్ వర్మ తను నిర్మించబోయే (ఆఖరి తెలుగు) చిత్రం ‘వంగవీటి’ సినిమా కధా చర్చల కోసం నిన్న విజయవాడ రావడం, దానికి ముందు ఆయన మంచి డ్రామా ఆడి రక్తి కట్టించడం అందరికీ తెలిసిందే. తను తీయబోయే సినిమా గురించి ఆయన చెప్పుకొంటే బాగానే ఉండేది కానీ ఆయన విజయవాడ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ట్వీటర్ లో చేసిన విమర్శలు పవన్ అభిమానులకు చాలా ఆగ్రహం కలిగిస్తున్నాయి. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఇటీవల ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష, దానిపై పవన్ కళ్యాణ్ స్పందన గురించి రామ్ గోపాల్ వర్మ నిన్న ట్వీటర్ లో కొన్ని అనవసరమయిన విమర్శలు చేసారు.
హీరో అంటే చిరంజీవి, పవన్ కల్యాణ్ మరియు మెగాఫ్యామిలీకి చెందిన వారు మాత్రమే అని రాష్ట్రంలోని కాపు వర్గం వారంతా మురిసిపోతారు. హీరో అనగా మనకు తెలిసిన నిర్వచనం సినిమా హీరో మాత్రమే గనుక.. అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ మాటలు కాపుల హీరో ఎవరు అనే విషయంలో కొత్త మొహాలను తెరపైకి తెస్తున్నాయి. మెగాఫ్యామిలీ అంతా ఫేక్ హీరోలే.. ముద్రగడ అసలు హీరో అన్న వ్యాఖ్యలు మామూలువి కాదు. అయితే ఏదో సంచలనాలకోసం నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతూ ఉండే వర్మ.. చెప్పిన ఈ ‘హీరోయిజం’ కాపు వర్గంలో ముసలం అవుతుందా? ఏమో వేచిచూడాలి.
పవన్ కళ్యాణ్ గురించి రామ్ గోపాల్ వర్మ ఏమ్మన్నారంటే : “కాపు చర్మాలు, కమ్మ మనస్తత్వంతో ఉండే సాధారణ సినీ తరాలతో పోలిస్తే ముద్రగడ పద్మనాభమే అసలయిన మెగా పవర్ స్టార్. నాకు రాజకీయాలపై, ప్రజా సంక్షేమంపై ఏమాత్రం ఆసక్తి లేదు కానీ ఒకవేళ ముద్రగడ రాజకీయ పార్టీని స్థాపించినట్లయితే అందులో నేను తప్పకుండా జేరుతాను. నేను కాపుని కాను. నాకు చాలా మంది కమ్మ స్నేహితులున్నారు.”
“ముద్రగడ సింహాలా గర్జించారు కానీ మెగా పవర్ స్టార్ మాత్రం డల్బై సౌండ్ లో కూడా ఆయనలాగా గర్జించలేకపోయారు. సినీ పరిశ్రమలో మెగా పవర్ స్టార్ అని పిలువబడే సాధారణ, నకిలీ స్టార్స్ కంటే ముద్రగడ పద్మనాభమే చాలా నయం. ఆయనే అసలు సిసలయిన మెగా పవర్ స్టార్,” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాలని, ఆయన ఒక్కడి వల్లనే రాష్ట్ర రాజకీయాలలో మార్పు వస్తుందని, ఆయన వస్తే ఆయన వెంట రాష్ట్ర ప్రజలు అందరూ నడుస్తారని ఇదే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తప్పటడుగులు వేస్తుండటంతో వర్మ ఆయనపై చాలా విమర్శలు చేసారు. ఇంకా నేటికీ చేస్తూనే ఉన్నారు.