హైదరాబాద్: రాంగోపాల్ వర్మ ఎందుకో ఈ మధ్య మహేష్‌ను టార్గెట్ చేశాడు. ఆగడు సినిమా సందర్భంలో ఆ సినిమాపై, దర్శకుడు శ్రీను వైట్లపై వ్యంగంగా ట్వీట్ చేసిన వర్మ, ఇవాళ బాహుబలి చిత్రంపై స్పందిస్తూకూడా మహేష్‌పై విసుర్లు విసిరాడు. బాహుబలి అసలు ప్రభావం తర్వాత విడుదల కాబోతున్న పెద్ద హీరో సినిమాపై పడబోతుందని వ్యాఖ్యానించాడు. బాహుబలి ఆ హీరో ఐశ్వర్యాన్ని తగ్గిస్తుందంటూ పరోక్షంగా మహేష్ తర్వాతి సినిమా ‘శ్రీమంతుడు’ గురించి ప్రస్తావించారు. శ్రీమంతుడు ఆగస్టు 7వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
మరోవైపు బాహుబలిని వర్మ విపరీతంగా పొగిడేశాడు. సింహాలు, పులులు, ఏనుగులు ఉన్న ఈ ఇండస్ట్రీలోకి బాహుబలి డైనోసార్ లాగా వచ్చిందని, దీంతో గతంలో ఉన్న పాలన మారబోతోందని వ్యాఖ్యానించాడు. ప్రభాస్ నటన అద్భుతమని, ఇక రానా విగ్రహ పరంగా, నటన పరంగా శిఖరస్థాయికి చేరాడని అన్నాడు. రాజమౌళి ఇక్కడ పుట్టటం తెలుగువారికి గర్వకారణం, బాంబేలోనో, లాస్ ఏంజల్స్‌లో పుట్టకపోవటం అతని దురదృష్టమంటూనే, అతను ఒరిస్సాలో, అస్సాంలో, టింబక్టూలో పుట్టినా అతను రాజమౌళిగానే ఉంటాడని, తెలుగువారు దానిగురించి అంత సెక్సైట్ కానవసరంలేదని విలక్షణ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి చిత్రం పెద్ద పెద్ద స్టార్లకు ఒక మేలుకొలుపు కావాలని వర్మ అన్నాడు.