లోకేష్, పవన్ కల్యాణ్ లపై అసభ్యకరమైన రాతలతో పోస్టులు పెడుతున్న భారతి సిమెంట్స్ ఉద్యోగి… వర్ర రాఘవేంద్రవెడ్డిని హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీకి మద్దతు ప్రకటించడం అంటే.. తెలుగుదేశం, జనసేన పార్టీ నేతల్ని.. వ్యక్తిగతంగా దూషించడమని వారు అనుకోవడంతోనే అసలు సమస్య వస్తోంది. కడప జిల్లాకు చెందిన భారతి సిమెంట్స్ ఉద్యోగి వర్ర రాఘవేంద్రరెడ్డి… తను పని చేస్తున్న సంస్థ యజమాని అయిన జగన్ కు మద్దతు గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ప్రచారం మొత్తం… లోకేష్ , పవన్ కల్యాణ్ ను.. వ్యక్తిగతంగా దూషిస్తూ.. మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ.. అత్యంత దారుణంగా.. విమర్శలు చేస్తూ ఉంటాడు. అదే జగన్ ను సమర్థించడం అని వర్ర రాఘవేంద్రరెడ్డి అనుకుంటున్నారు. ఆ పోస్టులు శృతి మించడంతో… టీడీపీ, జనసేన నేతలు.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ పోస్టులు చూసి.. ఆశ్చర్యపోయారు. వెంటనే… కేసు నమోదు చేసి.. కడపకు వెళ్లి వర్ర రాఘవేంద్రరెడ్డిని పట్టుకొచ్చి లోపలేశారు.
రాజకీయ పార్టీలకు ఇప్పుడు సోషల్ మీడియాలు పెద్ద ప్రచార అస్త్రం. అందుకే.. రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. వందల మందితో ప్రత్యేకంగా కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. ఇక సానుభూతి పరులతో చేయించే ప్రచారం అంతా ఇంతా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడో ముందు ఉంది. ఆ పార్టీ .. సోషల్ మీడియా విభాగంపై నెలకు కోట్లలోనే ఖర్చు చేస్తుందన్న ప్రచారం ఉంది. ఖాతాల్ని సృష్టించిన వారికి, లైక్ చేసిన వారికి, కామెంట్లు చేసిన .. పోస్టుల వారీగా డబ్బులిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇక జగన్ కుటుంబ సంస్థల్లో పని చేసేవారిని కూడా ప్రత్యేకంగా… సోషల్ మీడియాలో వైసీపీ కోసం ప్రచారం చేయమని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది అభిమానంతో.. మరికొంత మంది ఒత్తిడితో సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఫేక్ పోస్టుల మీదే నడుస్తోందన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. గతంలో ఇలాంటి అసభ్యరాతలు ఏకంగా శాసన మండలి మీదే రాయడంతో… ఇంటూరి రవికిరణ్ అనే పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతర్వాత అతన్నే… సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జ్ ను చేశారు. ఆ తర్వాత ఆ బూతులకు… ఫేక్ పోస్టులకు అంతు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో.. ఇవి మరీ శృతి మించాయి. జగన్ పై కోడి కత్తి దాడి ఘటన తర్వాత ఫ్లెక్సీని మార్ఫింగ్ చేసి.. చంద్రబాబు, లోకేష్ ఫోటో పెట్టారు. ఏకంగా ఓ టీడీపీ ఐడీ కార్డునూ సృష్టించారు. దీన్ని నేరుగా.. వైసీపీ నేత జోగి రమేష్ రిలీజ్ చేశారు. చంద్రబాబు బెంగళూరు వెళ్లినప్పుడు.. కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులను మార్ఫింగ్ చేయడంతో… కూడా కేసులు నమోదుయ్యాయి. చిత్తూరు జిల్లా నుంచి ఇద్దర్ని అరెస్ట్ చేశారు కూడా.. అయినా కానీ.. వైసీపీ…నేతల్లో మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల్ని తిట్టడమే రాజకీయ ప్రచారం అనుకునే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయింది.