రేటింగ్: 2.75/5
మనకు మహిళా దర్శకులు చాలా తక్కువ. ఇప్పుడంటే నందినిరెడ్డి పేరు కాస్త గట్టిగా వినిపిస్తోంది గానీ, ఇది వరకు… అలా నిలబడి, నాలుగు సినిమాలు తీసిన వాళ్లు లేరు. కాకపోతే.. ఇప్పుడు మళ్లీ వాళ్ల హవా మొదలైంది. ఒకొక్కరుగా ముందుకొస్తున్నారు. అయితే ఎవరు ఏ సినిమా తీసినా – హీరోయిన్ పాత్రని కాస్త స్ట్రాంగ్ గా రాసుకోవడం అభినందించదగిన విషయం. ఎందుకంటే.. వాళ్లు కూడా.. కథానాయిక పాత్రని బలంగా తీర్చిదిద్దకపోతే – తెలుగు తెరపై నాయిక మరింత బలహీనమైపోతుంది. `వరుడు కావలెను`తో లక్ష్మీ సౌజన్య మెగాఫోన్ పట్టారు. ఆమె కూడా ఆనవాయితీ ప్రకారం… ఓ అమ్మాయి కథే చెప్పాలనుకున్నారు. నాగశౌర్య లాంటి మంచి హీరో, సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సంస్థ, వెనుక త్రివిక్రమ్ అండ దండలు ఈ కథకు దొరికాయి. మరి… ఇవన్నీ కలిసి లక్ష్మీ సౌజన్య ఆలోచనల్ని ఎంత వరకూ నిలబెట్టాయి? వరుడు కావలెను ఏ వర్గానికి నచ్చుతుంది? తెలుసుకుంటే..
భూమిక (రీతూ వర్మ) ఓ కంపెనీకి బాస్. తను చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే తన ముందు గట్టిగా నవ్వడమూ పాపమే. ఆఫీసులో అందరూ తనకు గజగజ వణుకుతుంటారు. ప్రేమ – పెళ్లి విషయాలపై పెద్దగా నమ్మకాల్లేవు. తను ఎవరికీ కనెక్ట్ అవ్వదు. ఇంట్లో తనకెన్ని పెళ్లి సంబంధాలు తెచ్చినా రిజెక్ట్ అయిపోతుంటాయి. మరోవైపు ఆకాష్ (నాగశౌర్య) విదేశాల్లో స్థిరపడిన ఓ ఆర్కెటిక్. చిన్న పని మీద ఇండియా వస్తాడు. వచ్చీ రాగానే భూమిని చూసి ఇష్టపడతాడు. గతంలో ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నవారే. భూమి మనసుని గెలుచుకోవడానికి ఆకాష్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. భూమి కూడా ఆకాష్ ని ఇష్టపడేలోగా ఆకాష్ చేసిన ఓ తింగరి ప్లాన్ బెడసి కొడుతుంది. దాంతో… భూమి మళ్లీ మనసు మార్చుకుని రాయిలా మారిపోతుంది. భూమి అలా మారడానికి కారణమేంటి? ఆకాష్ మనసుని తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? వీరిద్దరూ కలిశారా, లేదా? అనేదే కథ.
లక్ష్మీ సౌజన్య రాసుకున్న కథ చాలా చిన్నది. కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే… మంచి తారాగణం, నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల పనితనం.. ఇవన్నీ కలిసి ఈ కథని అందంగా మార్చాయి. భూమిక పాత్ర చిత్రణ, తనతో మిగిలిన వాళ్లు పడే తిప్పలు.. సరదాగా అనిపిస్తాయి. విదేశాల నుంచి ఆకాష్ రావడం, భూమి దృష్టిలో పడడానికి చేసే ప్రయత్నాలు బాగున్నాయి. అయితే.. ఈ కథంతా `మన్మథుడు`కి రివర్స్ గేర్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ… హీరోకి పెళ్లంటే పడదు. ఇక్కడ హీరోయిన్ కి పడదు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టూ సేమ్… అన్నట్టే అనిపిస్తుంది. భూమికి పెళ్లి చేద్దామని తల్లి (నదియా) పడే తాపత్రయం కొన్ని చోట్ల నవ్వు తెప్పిస్తుంది. ఇంకొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. మాస్ కోసమో… హిందీ డబ్బింగ్ రైట్స్ కోసమో రెండు ఫైట్లు పెట్టారు. అవి కథలో ఇమడకపోయినా – చూడ్డానికి స్టైలీష్ గా అనిపిస్తాయి. పాటలు, అక్కడక్కడ ఫన్నీ డైలాగులు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వల్ల… సన్నివేశాలు ఓ ఫ్లోలో సాగిపోతుంటాయి. కాకపోతే… అక్కడక్కడ స్లో ఫేజ్ ఇబ్బంది పెడుతుంది.
ఇలాంటి కథల్లో సంఘర్షణ చాలా అవసరం. అది `వరుడు కావలెను`లో కనిపించదు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో.. కాన్లిఫ్ట్ కావాలని ఇరికించినట్టే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా. 20 నిమిషాల పాటు సాగిన కాలేజీ ఎపిసోడ్ ఈ సినిమాకి పెద్ద మైనస్. అక్కడ రచయితల బృందం మరోలా ఆలోచిస్తే కచ్చితంగా వరుడు కావలెను మరో లెవిల్ లో ఉండేది. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే.. కథ కాస్త వేగం పుంజుకుంటుంది. `లాగ్` కామెడీ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆ ఎపిసోడ్ మొత్తం.. హిలేరియస్ గా పండింది. సెకండాఫ్ ని కాపాడింది ఆ ట్రాకే. ఆ తరవాత… కథ చక చక క్లైమాక్స్ వైపు పరుగులు పెడుతుంది. మరీ ఓవర్ మెలోడ్రామాకి చోటివ్వకుండా – కథని త్వరగా ముగించేశాడు. ఎక్కడా అశ్లీలత, అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోవడం, కుటుంబం అంతా కలిసి చూసేంత క్లీన్ సినిమా కావడం, ఫన్ పండడం, రెండు మూడు పాటలు బాగుండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి.
రీతూ వర్మ ఈ సినిమాకి సెంట్రాఫ్ అట్రాక్షన్.చీర కట్టులో చాలా అందంగా కనిపించింది. గాంభీర్యం, ప్రేమ, వేదన.. ఇవన్నీ చక్కగా పండించింది. తన కెరీర్లో తప్పకుండా మరో మంచి పాత్రగా మిగిలిపోతుంది. తను మాస్ డాన్సులూ చేయగలదని ఈ సినిమా నిరూపించింది. ఇక శౌర్య సంగతి చెప్పాల్సిన పనిలేదు. తను ఎంత డీసెంట్ నటుడో ఈ సినిమాతో మరోసారి తెలిసొచ్చింది. తన పాత్రనిచాలా హుందాగా, అందంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. తన లుక్, డ్రస్సింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరింత అందంగా కనిపించాడు. తన పాత్ర తగ్గి, హీరోయిన్ ఎలివేట్ అవ్వాల్సిన చోట… ఆ ఛాన్స్ ఇచ్చాడు. మొత్తంగా తనకు ఇది మరో మంచి సినిమా. నదియా కాస్త ఓవర్ అనిపించింది. మురళీ శర్మకు డైలాగులు తక్కువ. కాకపోతే.. అమ్మాయిల పెళ్లి గురించి ఎందుకు తల్లిదండ్రులు అంత కంగారు పడతారు? అనే చోట.. తనతో మంచి డైలాగులు చెప్పించారు. సప్తగిరి ట్రాక్ బాగా నవ్విస్తుంది.
దిగు దిగు దిగు నాగ.. పాట ఆడియో పరంగా సూపర్ హిట్. పెళ్లి పాట కూడా ఓకే అనిపిస్తుంది. పాటలన్నీ నచ్చుతాయి. వాటిని తెరకెక్కించిన తీరు బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ హెవీగా అనిపిస్తుంది. గణేష్ రావూరి సంభాషణ పరంగా తన చాతుర్యం చూపించారు. పంచ్ డైలాగులు, డెప్త్ డైలాగులూ రెండూ బాగా పడ్డాయి. కొన్ని చోట్ల… సంభాషణలే సన్నివేశాన్ని నిలబెట్టాయి. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు ఇది శుభారంభం. తన నుంచి మరిన్ని మంచి కథలు ఆశించొచ్చు.
ఫినిషింగ్ టచ్: మంచి వరుడు దొరికేశాడు
రేటింగ్: 2.75/5