కరోనా కారణంగా సినీ థియేటర్ లు కొన్ని నెలలుగా మూగపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే దీని ప్రభావం నుండి కోలుకొని థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా విడుదలవుతున్న సినిమాలకు ఏదో ఒక రకమైన వివాదం తలెత్తుతోంది. తాజాగా గీత రచయిత అనంత శ్రీరామ్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
నాగ శౌర్య రీతువర్మ హీరోహీరోయిన్లుగా వరుడు కావలెను అన్న సినిమా రూపొందుతోంది. ఇందు లో దిగు దిగు నాగ పేరుతో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఈ పాట రాసింది గీత రచయిత అనంత శ్రీరామ్. అయితే నాగదేవతకు భక్తితో పాడుకునే పాట ని ఐటమ్ సాంగ్ గా మార్చడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి పార్టీకి చెందిన యువ మోర్చా విభాగం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, భక్తులను కించపరిచేలా ఈ పాట ఉందని, ఈ పాటను రాసిన అనంత శ్రీరామ్ తో పాటు పాట చిత్రీకరించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బిజెపి యువమోర్చా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ రెండు రోజుల క్రిందట బిజెపి నేత యామిని సాధినేని కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న సినిమాపై ఇదే రకంగా వివాదాన్ని చేశారు. ఆ సినిమాలో భజగోవిందం పాట లో భక్తుల మనోభావాలు కించపరిచారంటూ ఆవిడ దర్శకనిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడం , దర్శకుడు క్షమాపణలు చెప్పడం కూడా జరిగాయి. మరి వరుడు కావలెను టీం తాజా వివాదం పై ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి – ఈ వివాదాల కారణంగా కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ ఆయా సినిమాలకు మాత్రం సులభంగా లభిస్తోంది. మరి ఇది యాదృచ్చికంగా జరుగుతోందా , లేక పబ్లిసిటీ కోసం దర్శక నిర్మాతలే ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా, ఒక వేళ అది కాకపోతే రాజకీయ పార్టీలతో చిత్ర యూనిట్ లు కుమ్మక్కై పబ్లిసిటీ కోసం ఇటువంటివి చేస్తున్నారా అన్న ప్రశ్న మాత్రం ప్రేక్షకుల మదిలో కొనసాగుతూనే ఉంటుంది.