అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమా తీయాలన్న ఆలోచన తెలుగు దర్శక నిర్మాతలకు రావడమే ఓ గొప్ప శుభపరిణామం. స్పేస్, సైన్స్ ఫిక్షన్ కథలంటే… అది హాలీవుడ్ వాళ్ల సొత్తు అనుకుని, వాళ్లు తీసిన సినిమాల్ని చూసుకుంటే గడిపేయడమే మార్గం అనుకుంటున్న తరుణంలో `అంతరిక్షం` వస్తోంది. ఘాజీలాంటి సినిమాతో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, `కంచె`లాంటి హృద్యమైన చిత్రాల్ని అందించిన నిర్మాణ సంస్థ `అంతరిక్షం`ని రూపొందించడంతో ఈ సినిమాపై నమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే.. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఓ ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంతరిక్షంలో ఓ భారతీయ హ్యూమగామి చేసే సాహసాల సమాహారం ఈసినిమా. అటు స్పేస్ సైన్స్‌ని, ఇటు దేశభక్తిని రెండింటినీ మిళితం చేసినట్టు అనిపిస్తోంది. ప్రాణాలకు తెగించిన ఓ భారతీయ హ్యూమగామి…. తన దేశ ప్రతిష్టని కాపాడడానికి ఏం చేశాడన్నదే ఈ కథ. అతనికో ప్రేమ కథ కూడా ఉంది. అన్నిరకాల భావోద్వేగాలల్ని మిళితం చేశాడు సంకల్ప్ రెడ్డి. ”ఓడిపోతే ఎలా అని కాదు… గెలవడం ఎలా అని ఆలోచించాలి” అంటూ గెలుపు మంత్రం ఉపదేశించాడు. హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే.. ఈ సినిమా క్వాలిటీ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎంత బాగున్నాయి? టెక్నికల్‌గా ఏ స్థాయిలో ఉంది? అనే విషయాలకంటే.. అలాంటి అరుదైన ఆలోచన వచ్చినందుకు చిత్రబృందాన్ని అభినందించాలి. మరి వాళ్ల ప్రయత్నం సాకారం అయ్యిందో లేదో తెలియాలంటే.. ఈనెల 21 వరకూ ఎదురుచూడాలి. అంతరిక్షం వచ్చేది అప్పుడే.