ముకుంద, కంచె… ఇలా డీసెంట్ సినిమాలతో ప్రయాణం సాగిస్తున్నాడు వరుణ్ తేజ్. నటుడిగా వరుణ్ ఓకే అనిపించుకొన్నా.. ఆ సినిమాలేం హిట్లుగా నిలవలేదు. లోఫర్ అయితే ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయితే వరుణ్ క్రేజ్ సినిమా సినిమాకీ పెరుగుతూ వచ్చింది. దాంతో.. ఇప్పుడు పారితోషికం హైక్ చేసేశాడట. లోఫర్‌కి రూ.2 కోట్లు తీసుకొన్న వరుణ్… ఇప్పుడు మిస్టర్ కోసం ఏకంగా రూ.5 కోట్లు అడుగుతున్నాడని టాక్. దాంతో మిస్టర్ సినిమా డైలామాలో పడినట్టైంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ముందు నుంచీ ఇబ్బందులే. సెకండాఫ్ సరిగా రాలేదన్న సాకు చూపి ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండా అడ్డుకొన్నాడు వరుణ్. అయితే అదేం లేదని, వీసాలు రాకే సినిమా ఆలస్యమైందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు పారితోషికంతో మోకాలడ్డుతున్నాడు వరుణ్.
అయితే అసలు సమస్య పారితోషికం కాదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీనువైట్లతో సినిమా చేయడం వరుణ్‌కి ఇష్టం లేదని, అందుకే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని చెప్పుకొంటున్నారు. దిల్‌రాజు సినిమా కోసం రెండున్నర కోట్లకే అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన వరుణ్, మిస్టర్ కోసం రెట్టింపు పారితోషికం డిమాండ్ చేయడం చూస్తేనే.. వరుణ్‌కి ఈ సినిమా చేయాలన్న ఆసక్తి లేదన్న విషయం అర్థమైపోతోందని ఆయన సన్నిహితులు గుసగుసలాడుకొంటున్నారు. ముందు శేఖర్ కమ్ముల సినిమాని మొదలెట్టాలన్న ఆలోచనలో వరుణ్ ఉన్నాడని, అందుకే ఇలా తప్పించుకొంటున్నాడని చెప్పుకొంటున్నారు. మరి వరుణ్ మనసులో ఏముందో, ఎందుకు మిస్టర్‌ని దూరంగా పెడుతున్నాడో, ఆయనకే తెలియాలి.