మెగా హీరోల్లో వరుణ్ తేజ్ పరిస్థితి కొంచెం క్లిష్టపరిస్థితుల్లో ఉందిప్పుడు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేసే వరుణ్.. మెల్లగా కమర్షియల్ దారి పట్టడం, ఆయా చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడం వరుణ్ ని ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టేశాయి. ‘గని’, ‘ఆపరేషన్ వాలైంటేన్’, ‘గాంఢీవధారి అర్జున’, ‘మట్కా’… ఇలా వరుసగా ఫ్లాపులు తగిలాయి. ఇలాంటి స్థితిలో ఏ హీరో అయినా పారితోషికం తగ్గించుకొని, నిర్మాతలకు అందుబాటులో ఉండాలని చూస్తారు. కానీ.. వరుణ్ మాత్రం తన పారితోషికం ఏమాత్రం తగ్గించలేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకూ రూ.7 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఇటీవల ఓ నిర్మాత వరుణ్ని సంప్రదిస్తే.. రూ.7 కోట్ల పారితోషికం అడిగాడట. తన చేతిలో ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రూ.7 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడని, కొత్త సినిమాలకూ ఇదే మొత్తం డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.
కొంతమంది హీరోలు అంతే. ఫ్లాపులకూ అందుకొనే రెమ్యునరేషన్కూ ఏమాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ పారితోషం తగ్గిస్తే – క్రేజ్ తగ్గిపోయిందేమో అని మార్కెట్ ఫీలవుతుందని వాళ్ల భయం. రవితేజ కూడా ఇంతే. సినిమాలు వరుసగా డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ పారితోషికం తగ్గించేవాడు కాదు. ఇప్పుడు వరుణ్‌తేజ్ కూడా అదే చేస్తున్నాడు. మీడియం రేంజు హీరోలకు మినిమం ఓటీటీ గ్యారెంటీ ఉంటుంది. ఆ ఓటీటీ కోసమే… రెమ్యునరేషన్లు స్టడీగా ఉంటున్నాయి.