తెలుగు360.కామ్ రేటింగ్ 3.5/5
శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమాల `రాత` మార్చడానికి `అమెరికా` నుంచి ఊడిపడిన దర్శకుడు.
- పిజ్జా బర్గర్ టేస్ట్ చూశాడు కాబట్టే.. ఆవకాయ రుచి ఎంత గొప్పదో అర్థమైందేమో…
- కాంక్రీట్ జంగల్లో ఉన్నాడు కాబట్టే… మన మట్టి గుభాళింపుల్ని మరింత ప్రేమించాడేమో..
- ప్లాస్టిక్ అభిమానాల మధ్యలోంచి వచ్చాడు కాబట్టే.. సహజత్వం అంటే చచ్చిపోతాడేమో…
తన ప్రేమ, తన అభిరుచి, తన మమకారం తన దగ్గరే ఉంచుకోకుండా.. సినిమాలపై ధారబోయడం నేర్చుకొన్నాడు. అందుకే ఆనంద్.. మంచి కాఫీలాంటి సినిమా అందించాడు. గోదావరి హోరు.. థియేటర్లో వినిపించాడు. కమర్షియల్ ఛట్రంలో తన్నుకుపోతున్న టాలీవుడ్‌కి హ్యాపీడేస్ వచ్చేలా చేశాడు. శేఖర్ రాకతో చాలా మారిపోయాయి. తెలుగు తెరపై సహజత్వం చూసే అవకాశం,అదృష్టం దక్కింది. మధ్యలో ఎందుకో శేఖర్ నిద్రపోయాడు… మూడేళ్ల తరవాత మళ్లీ లేచాడు.. మనల్ని ఫిదా చేయించేశాడు.
* కథ..
కథ… ఏముంది ఈ సినిమాలో `ఇదీ కథ..` అని చెప్పుకొనే వస్తువు. సహజంగా నడిచే రోజులో.. సహజంగా సాగే మన జీవితంలో కథ ఉండదు. సంఘటనలు, భావోద్వేగాలు, అలకలు, కవ్వింతలు, కలలు ఉంటాయి. `ఫిదా`లో ఆవే ఉన్నాయి. ఓ అబ్బాయి – ఓ అమ్మాయి, అమ్మాయికి దూకుడెక్కువ. అరిచి ఆలోచిస్తుంది. అబ్బాయి కాస్త నెమ్మది.. ఆలోచించి అరుస్తాడు ఇద్దరీ ఒకరిపై మరొకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అమ్మాయి తొందరపాటు వల్ల.. ఆ ప్రేమ పుట్టకుండానే చచ్చిపోతుంది. ఆ అబ్బాయి నెమ్మది కాబట్టి.. ఆ ప్రేమని బతికించుకోవడానికి కాస్త టైమ్ తీసుకొంటాడు. ఈలోగా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అబ్బాయి నచ్చచెబుతాడు. ఇద్దరూ మళ్లీ ప్రేమించుకొంటారు. అంతే.. ఖేల్ ఖతమ్. దుకాణ్ బంద్. అంతే కథ. కానీ అంతే కాదు. మధ్యలో ఎన్ని భావోద్వేగాలో, ఎన్ని అలకలో, ఎన్ని కవ్వింతలో.
సాయి పల్లవిని చూస్తే.. తెలంగాణలోని ఓ పచ్చని పల్లెటూరికి పరికిణీ వేసినట్టుంటుంది. తెలంగాణ యాసకీ, సొగసుకీ.. ఆడదనం అబ్బినట్టు ఉంటుంది. తెరపై ఆమె నవ్వుతుంటే.. మనసులో మెటికలు విరుచుకోవాల్సిందే. ఇలాంటి అమ్మాయి నాకు దొరికితే బాగుణ్ణు అని ఏ కుర్రాడైనా అనుకోకపోతే… విడ్డూరం అనుకోవొచ్చు. హీరోయిన్ కి కావల్సిన ఏ మెటీరియల్ ఈ అమ్మాయిలో కనిపించవు. మనమ్మాయిలా.. మనింటి అమ్మాయిలా అనిపిస్తుంది. అదొక్కటి చాలదూ..! ఈ సినిమా చూడ్డానికి.
ప్రేమ కథల్లో.. ప్రేమ తప్ప అన్నీ కనిపిస్తుంటాయి. శేఖర్ కమ్ముల ఆ పైత్యానికి పడిపోడు. ఆ పైత్యం వడ్డించడు. అందుకే.. ఈ ప్రేమ కథలో ప్రేమే కనిపించింది.
లవ్ స్టోరీ చూసి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకొని ఎంత కాలం అయ్యిందో. ఫిదా ఆ లోటు తీరుస్తుంది. సాయి పల్లవి- వరుణ్ తేజ్. ఇద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అనలేం. ఎందుకంటే తాటి చెట్టు ముందు.. తులసి మొక్క.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అవుతారు. కానీ… ఇద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ మాత్రం.. బాగుంది. హీరోయిన్ హీరోని దూరం చేసుకొంటున్నా. హీరో… హీరోయిన్ని దూరం పెడుతున్నా.. ప్రేక్షకుడి గుండెలు మెలిపడిపోతుంటాయి. అదేనేమో కెమిస్ట్రీ అంటే.
ప్రేమ కథలో కథ లేకపోయినా ఫర్లేదు. ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఈ సినిమాలో కావల్సినంత ఉంది. తన ప్రేయసి కోసం కలని, కన్న ఊరిని, తన ప్రపంచాన్ని వదిలి ఓ ప్రేమికుడు వచ్చేసినంత ఉంది. అందుకే… ఫిదా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
* నటన
సాయి పల్లవి నటించలేదు. జస్ట్ ప్రవర్తించింది. జ్యోతిక చంద్రముఖిలా మారిపోయినట్టు.. సాయి పల్లవి భానుమతిగా మారిపోయిందంతే. ఈ అమ్మాయిది తెలంగాణ కాదు, అసలు తెలుగమ్మాయే కాదు అంటే.. కొంత కాలం నమ్మరు. ఆమె ఫేస్ క్లోజప్‌లో చూపిస్తే.. మొటిమలతో ఎర్రగా కందిపోయిన బుగ్గలు కనిపిస్తాయి. కానీ… ఎందుకో.. ఆ మొటిమలూ తెగ నచ్చేస్తాయి. అంత బాగుంది సాయి పల్లవి. బహుశా.. పాత్రలో ఉన్న గొప్పదనం అలా అనిపించేలా చేసిందేమో.
వరుణ్‌తేజ్… ఓ పదేళ్ల వరకూ ఈ సినిమా గురించి చెప్పుకోవొచ్చు. మిస్టర్ లాంటి ఫ్లాపులు వచ్చినా కాస్త తట్టుకోవొచ్చు. హీరోయిజంతో పుట్టిన కథలకు ఎంత న్యాయం చేస్తాడో చెప్పలేం గానీ.. ఇలాంటి పాత్రలకు మాత్రం బాగా సూటవుతాడని మరోసారి నిరూపించాడు.
* సాంకేతికత
శేఖర్ కమ్ముల – మిక్కీ జే.మేయర్.. ఈ జోడీ ఇచ్చిన బాణీలు విని వినీ ఆస్వాదించీ దించీ అలసిపోయి.. బోర్ కొట్టేసింది. అందుకే.. సంగీత దర్శకుడ్ని మార్చాడు శేఖర్. అది చక్కటి ఫలితం అందించింది. పాటలు బాగున్నాయి. సంగీత్‌లో సాయి పల్లవి డాన్స్ చేసిన పాట అయితే సూపర్. ఆమె డాన్స్ ఇంకా సూపర్. దర్శకుడిగా శేఖర్ బలం.. సహజత్వం. అందుకు తగిన వేదిక హ్యాపీడేస్ తరవాత మరోసారి దొరికింది. హ్యాపీడేస్లోనూ కొంత డ్రమెటిక్ సన్నివేశాలు ఉంటాయి. అయితే ఈ సినిమాలో అవి ఎక్కడా కనిపించవు. ఫస్ట్ ఆఫ్ ఏసీ బస్సులో ప్రయాణంలా ఉంటే.. సెకండ్ ఆఫ్.. రైల్ జర్నీ. అక్కడక్కడ కాస్త కుదుపులు ఉంటాయి. కానీ.. ప్రయాణం ప్రశాంతంగా సాగిపోతుంది.
* బలాలు
-
- సాయి పల్లవి
-
- సంభాషణలు
-
- శేఖర్ కమ్ముల దర్శకత్వం
-
- పాటలు
* బలహీనతలు
- అక్కడక్కడ.. స్లో
* ఫైనల్ టచ్ : గట్టిగా అనుకోండి.. ఈ సినిమా మరో హ్యాపీడేస్ అవ్వాలని… అయిపోతుందంతే!
తెలుగు360.కామ్ రేటింగ్ 3.5/5