వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇటీవల లండన్లో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు హైదరాబాద్ లో మరో కీలకమైన షెడ్యూల్ ప్రారంభం కావాల్సివుంది. కానీ.. దర్శకుడు – నిర్మాతల మధ్య వచ్చిన గ్యాప్ వల్ల.. రెండో షెడ్యూలుకి బ్రేక్ పడింది.
లండన్ షెడ్యూల్ లో దర్శకుడు నిర్మాతతో భారీగా ఖర్చు పెట్టించినట్టు టాక్. ముందు అనుకొన్న బడ్జెట్ వేరు.. లండన్ లో అయ్యింది వేరట. దాంతో కొత్త షెడ్యూల్ కోసం బడ్జెట్ వేసి ఇవ్వాలని, ఆ తరవాతే.. షూటింగ్ పెట్టుకోమని నిర్మాత చెప్పాడట. ప్రవీణ్ సత్తారు ఓ బడ్జెట్ వేసుకొని నిర్మాత దగ్గరకు వెళ్లాడు. ఆ బడ్జెట్ చూసి.. బివిఎస్ఎన్ ప్రసాద్ గుండెల్లో రాయి పడింది. ఇలా… ఖర్చు పెడుతూ పోతే, సినిమా మొత్తం అయ్యేసరికి తడిసి మోపెడవుతుందని భావించి. బడ్జెట్ లో సగానికి సగం కోత విధించారు. ‘ఇంతలో ఈ షెడ్యూల్ పూర్తి చేయాలి’ అంటూ గీత గీశారు. ప్రవీణ్ సత్తారు దేనికీ రాజీ పడే తత్వం కాదు. అందుకే కోరినంత బడ్జెట్ ఇస్తేనే కానీ, షూటింగ్ చేయలేను.. అని చేతులెత్తేశాడట. అలా.. ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే కానీ.. రెండో షెడ్యూల్ మొదలవ్వదు. ప్రవీణ్ సత్తారు తాజా సినిమా.. ఘోస్ట్ దారుణంగా దెబ్బ తీసింది. ఆ సినిమా హిట్టయితే, దర్శకుడిపై నమ్మకంతో నిర్మాత ఖర్చు పెట్టేవాడే. కానీ.. సినిమా ఫ్లాప్ వల్ల లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు దర్శక నిర్మాతల్లో ఎవరు తగ్గుతారో చూడాలి.