మెగా హీరోల్లో వరుణ్ తేజ్ దారి వేరు. మాస్ సినిమాలకంటే… కంటెంట్ బేస్డ్ కథలకే పెద్ద పీట వేస్తాడు వరుణ్. అందుకే తన దగ్గర్నుంచి కంచె, అంతరిక్షం లాంటి కథలొచ్చాయి. మాస్ కథలకూ తాను పర్ఫెక్ట్ గా సరిపోతాడు. బాలీవుడ్ హీరోలకుండే ఫీచర్స్ వరుణ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్ విస్కృతమవుతున్న ఈ దశలో వరుణ్ బాలీవుడ్ సినిమా చేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ వరుణ్ ఆ దిశగా ఆలోచించడం లేదు. బాలీవుడ్ లో సినిమా చేయాలి కాబట్టి, పనిగట్టుకొని సినిమా చేయకూడదని, కంటెంటే బాలీవుడ్ కి తీసుకెళ్లాలని చెబుతున్నాడు వరుణ్. తన కొత్త సినిమా `ఆపరేషన్ వాలెంటైన్` తన తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ అవ్వబోతోందన్న హింట్ ఇచ్చాడు.
గాండీవధారి అర్జున తరవాత వరుణ్ నుంచి రాబోతున్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇదో యాక్షన్ బేస్డ్ డ్రామా. ఈ సినిమాని హిందీలో సైతం విడుదల చేస్తున్నారు. తెలుగులో సినిమా తీసి, ఆ తరవాత హిందీలో డబ్ చేసి ‘మమ..’ అనిపించడం వరుణ్‌కి ఇష్టం లేదు. అందుకే తెలుగులోనూ, హిందీలోనూ రెండు వెర్షన్లలో ఈసినిమా తీశారు. వరుణ్ కూడా హిందీ నేర్చుకొని మరీ… సెట్లో డైలాగులు చెప్పాడట. ”నాకు బేసిగ్గా హిందీ రాదు. అందుకే ఈ సినిమా కోసం మూడు నెలలు కష్టపడి హిందీ నేర్చుకొన్నా. సెట్లో ప్రామ్టింగ్ లేకుండా నా డైలాగులు నేనే చెప్పా. డబ్బింగ్ కూడా చెప్పాలని ఆశగా ఉంది” అని చెప్పుకొచ్చాడు వరుణ్. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ డిసెంబరులో విడుదల కానుంది. సో… అఫీషియల్ గా వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందన్న మాట.