రేటింగ్: 2.5/5
స్పోర్ట్స్ డ్రామాతో ఓ సౌలభ్యం ఉంది. ఆట ఏదైనా సరే, యూత్ దానికి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. స్పోర్ట్స్ లోనే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి… వాటిని తెరపై చూపించడం కూడా ఈజీ అయిపోతుంది. అయితే.. మైనస్లూ ఉన్నాయి. ఏ స్పోర్ట్స్ డ్రామా అయినా ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. ఓ ఆటగాడి.. గెలుపు – ఓటమి… ఆమధ్య ఊగిసలాటే కనిపిస్తుంది. అయినా సరే, ఇదే జోనర్‌ని నమ్మకుని స్పోర్ట్స్ డ్రామాలు తయారవుతూనే ఉన్నాయి. అందులో మరోటి గని. వరుణ్ తేజ్ బాక్సర్ అవతారం ఎత్తిన సినిమా ఇది. మరి ఈ స్పోర్ట్స్ డ్రామా కొత్తగా ఏం చెప్పింది? ఇందులో ఉన్న ఎమోషన్ ఏమిటి?
గని (వరుణ్‌తేజ్)కి చిన్నప్పటి నుంచీ బాక్సింగ్ అంటే ఇష్టం. తన తండ్రి బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే… స్టెరాయిడ్స్ తీసుకొని బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడన్నది తనపై నెపం. అందుకే.. బాక్సింగ్ నుంచి వెలి వేస్తారు. ఆ అవమానంతో తల్లి (నదియా) కుంగిపోతుంది. `నువ్వెప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లకూడదు` అని చిన్నప్పుడే.. గని దగ్గర మాట తీసుకుంటుంది. తల్లికి మాటిచ్చినా.. గని చూపంతా బాక్సింగ్‌పైనే ఉంటుంది.తల్లికి తెలియకుండానే బాక్సింగ్ పై దృష్టి పెడతాడు. బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ అయి.. తండ్రితో పోయిన పరువుని మళ్లీ నిలబెట్టాలని చూస్తాడు. మరి ఆ ప్రయత్నంతో తనకెదురైన సవాళ్లేంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన కథ.
అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లానే.. `గని` కూడా. గని చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి కథ మొదలవుతుంది. తన తండ్రిపై గనికి ఎందుకు కోపం..? తన తల్లికి కూడా తెలియకుండా బాక్సింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాడు..? ఇవన్నీ బాగానే చూపించారు. అయితే కాలేజీ ఎపిసోడ్లు. తన తల్లితో బాండింగ్ ఇవేం సరిగా పండలేదు. హీరోయిన్ క్యారెక్టర్ బబ్లీగానే ఉన్నా.. ఎందుకో ఆమె నటన, హీరోపై చూపించే ప్రేమ ఇవన్నీ కృత్రిమంగానే అనిపిస్తాయి. ఈ ప్రేమకథకూ.. సినిమాకీ సంబంధం లేదు. ఆ ఎపిసోడ్లు లేకపోయినా, అసలు హీరోయినే లేకపోయినా.. అదే కథ. కేవలం నిడివిని పెంచుకోవాలన్న తాపత్రయం, హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి కదా అని మనకు మనం పెట్టుకున్న రూలు కోసమే.. ఆ పాత్ర అలా తెరపై కనిపిస్తూ మాయం అవుతూ ఉంటుంది. స్ట్రీట్ ఫైట్‌తో.. వరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. వరుణ్‌కి కోచ్‌గా… నరేష్ లాంటి నటుడ్ని చూపించడం సిల్లీగా అనిపిస్తుంది. నవీన్ చంద్రతో గొడవ పడడం రొటీన్ వ్యవహారం. `నేను గొడవ పడ్డానన్న విషయం.. అప్పుడే మర్చిపోయా. నువ్వు కూడా మర్చిపో.` అని ఓ రౌడీకి వార్నింగ్ ఇవ్వడం… `రేసు గుర్రం`లో సీనుని గుర్తుకు తెస్తుంది. చాలా సన్నివేశాలతో ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. ఏమాత్రం సర్ప్రైజ్ అవ్వకుండా చాలా చప్పగా సాగిపోతాయి.
విశ్రాంతి తరవాత.. ఉపేంద్ర ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అదొక్కటీ కాస్త ఆసక్తిగా,కథకి కనెక్టీవ్గా ఉంటంది. కాకపోతే.. అక్కడ కూడా క్రీడా రంగంలో కనిపించే పాత రాజకీయాలే ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక.. మళ్లీ ఆట మొదలవుతుంది. ఐబీఎల్ (ఇండియన్ బాక్సింగ్ లీగ్)లో హీరో ఎలా ఛాంపియన్ అయ్యాడు? తన తండ్రిని మోసం చేసినవాడిపై ఎలా బదులు తీర్చుకొన్నాడు? అనేది మిగిలి కథ. తొలి భాగంతో పోలిస్తే.. ద్వితీయార్థమే కాస్త ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే.. అసలు కథంతా అక్కడే ఉంది కాబట్టి. సెకండాఫ్ లో రొమాన్స్‌కూ, హీరోయిన్‌కీ అస్సలు తావే లేదు. అందుకే తెలివిగా తమన్నా పాట తీసుకొచ్చి పెట్టేశారు. మిగిలిన అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఏం జరుగుతుందో, గనిలోనూ అదే జరిగింది. కాకపోతే.. ఎమోషన్ మిస్సయింది. అంతే తేడా. తరవాత ఏం జరుగుతుందో ముందే ఊహించడం, ట్విస్టులు అనుకుని రాసుకున్న కొన్ని సీన్లు తేలిపోవడం `గని`లోని ప్రధాన లోపం.
వరుణ్‌ది మంచి బాడీ. బాక్సర్ అంటే ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి… ఆ పాత్రని సులవుగానే చేసుకుంటూ పోయాడు. ఎమోషన్ సీన్లలో ఎప్పటిలానే నటించాడు. `నా ఖాతాలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఉంటే బాగుంటుంది` అని అనుకుని.. ఈ సినిమా చేసుంటాడే తప్ప, కథతో సర్ప్రైజ్ అయిపోయి మాత్రం కాదని అర్థమవుతూనే ఉంది. హీరోయిన్ సయీ మంజ్రేకర్ కాస్త బబ్లీగానే ఉంది. తన పాత్రని హైపర్ యాక్టీవ్‌గా తీర్చిదిద్దడానికి ఎంత ప్రయత్నించినా.. సయీ ఆ పాత్రని నీరసంగానే చేసింది. కెమిస్ట్రీ, రొమాన్స్ అనే పదాలకు వరుణ్ – సయీ ఏమాత్రం చోటు ఇవ్వలేదు. నదియా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి… ఇలా ప్రతీ చిన్న పాత్రకూ పేరున్న నటుడ్ని తీసుకోవడం కలిసొచ్చింది. ఆ పాత్ర అంత బలంగా లేకపోయినా.. వాళ్లు చేశారు కాబట్టే.. చూడగలిగాం.
టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఖర్చుకి వెనకాడలేదన్న సంగతి అర్థమవుతోంది. తమన్ బీజియమ్స్ బాగున్నాయి. `కొడితే..` మంచి కిక్ ఇచ్చే సాంగ్. మిగిలిన పాటలేవీ అంతగా గుర్తుండవు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గుర్తుండిపోయే డైలాగ్ ఒక్కటీ లేదు. చాలా సాదా సీదా స్పోర్ట్స్ డ్రామా ఇది. తొలి సగం పేలవంగా ముగిస్తే.. ద్వితీయార్థంలో కాస్త నిలబడగలిగింది. పేరున్న నటీనటులు తెరపై కనిపించడం, వరుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం ఇవి మాత్రమే `గని`లో పాజిటీవ్ పాయింట్స్.
ఫినిషింగ్ టచ్: బో`రింగ్`
రేటింగ్: 2.5/5