‘ఎఫ్ 3’తో ఓ హిట్టు కొట్టాడు వరుణ్ తేజ్. గని ఫ్లాపుని అలా కవర్ చేసుకోగలిగాడు. వరుణ్ కొత్త కథల్ని విని, ఓకే చేసుకొనే పనిలో ఉన్నాడు. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా వరుణ్ పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కాల కాలం అయ్యింది. అయితే.. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేటూ లేదు. వాస్తవానికి ఈ సినిమా కాస్త డైలామాలో ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు ముందుకీ వెనక్కి ఊగుతోందని, వరుణ్ ఈ కథని హోల్ట్ లో పెట్టాడని టాక్. దానికి గల కారణాలు మాత్రం తెలీలేదు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఇప్పటికే నిర్మాత కొంత మొత్తం ఖర్చు పెట్టాడు. విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ వీసాల కోసం ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే సడన్ గా… ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టారు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమాపై ఎలాంటి మూమెంటూ లేదు. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాఆగిపోయిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనిపై కూడా ఎలాంటి బజ్ లేదు. అందుకే నిర్మాత ఈ ప్రాజెక్టుని వెయిటింగ్ లిస్టులో పెట్టారేమో. ఒకవేళ ఘోస్ట్ రిలీజ్ అయి, పెద్ద విజయం సాధిస్తే అప్పుడు ఏమైనా కదలిక రావొచ్చు.