‘జిల్’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్ని అందించిన దర్శకుడు రాధాకృష్ణ. రాధేశ్యామ్ తరవాత రాధాకృష్ణ నుంచి మరో సినిమా రాలేదు. గోపీచంద్ తో ఓ సినిమా తెరకెక్కబోతోందని వార్తలొచ్చాయి. కానీ గోపీ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు ఓ కథ చెప్పి ఒప్పించాడట రాధాకృష్ణ. ఇదో క్లాసికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఒకే అయిపోయినట్టే. బ్యానర్ ఏమిటి? ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.
ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమా చేస్తున్నాడు వరుణ్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఆచార్య సెట్లో ఓ ఐటెమ్ పాట రూపొందిస్తున్నారు. బహుశా.. ఈ సినిమా పూర్తయిన తరవాతే… రాధాకృష్ణ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.
వరుణ్ ఈమధ్య యాక్షన్ జోనర్లో సినిమాలు చేస్తున్నాడు. తనకో లవ్ స్టోరీ చేయాలని వుంది. అలాంటి కథతోనే రాధాకృష్ణ అప్రోచ్ అయ్యాడు. ‘రాధేశ్యామ్’ సినిమా ఫ్లాప్ అయినా, అందులో కొన్ని మూమెంట్స్ బాగుంటాయి. లవ్ స్టోరీ బాగానే డిజైన్ చేయగలిగాడు దర్శకుడు. బహుశా ఆ నమ్మకంతోనే వరుణ్ తేజ్ ఈ కథ ఓకే చేసి ఉంటాడు.