ప్రస్తుతం మిస్టర్, ఫిదా చిత్రాల్లో నటిస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు మరో సినిమాపై సంతకం చేసినట్టు టాక్. ప్రేమమ్‌తో హిట్ దర్శకుల జాబితాలో చేరిపోయిన చందూ మొండేటి వరుణ్ కోసం ఓ కథ సిద్దం చేసుకొన్నాడు. ఐ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఇప్పటికే కథ సిద్దమైంది. ప్రస్తుతం చందూ మొండేటి స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్దం చేసే పనిలో ఉన్నట్టు టాక్. ఇది గజిని టైపు స్టోరీ అని తెలుస్తోంది. గజినిలా షార్ట్ టైమ్ మొమొరీ లాస్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తయారవుతుందట. అయితే గజినీకీ ఈ సినిమాకీ ఎలాంటి పోలికలూ లేకుండా స్క్రీన్ ప్లే రూపొందించే పనిలో ఉన్నాడట చందూ. సైన్స్ ఫిక్షన్ కథలంటే చందూకి ఇష్టం. తన తొలి సినిమా కార్తికేయ కూడా ఒక విధంగా సైన్స్ ఫిక్షనే. స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్దం చేయడానికి కనీసం రెండు నెలలు సమయం కావాలన్నాడట చందూ. దానికి వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఫిదా పూర్తయ్యకే ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది. నాగార్జునకీ చందూ ఓ కథ సిద్దం చేశాడు. అదో పోలీస్ స్టోరీ. నాగ్‌కి కూడా ఈ కథ చెప్పాడు కూడా. అయితే నాగ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలీదు. మొత్తానికి అటు వరుణ్‌తో, ఇటు నాగ్ తో సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసుకొన్నాడు చందూ. ఆ లెక్కన మరో రెండేళ్లు ఈ దర్శకుడు బిజీనే.