హారర్, థ్రిల్లర్ జోనర్లపై మెగా హీరోల దృష్టి కూడా పడిపోయింది. ఇటీవలే విరూపాక్షతో… సాయిధరమ్ తేజ్ ఓ హిట్టు కొట్టాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాడు. బాలీవుడ్లో విజయవంతమైన హారర్, కామెడీ సినిమా ‘భూల్ భులాయా 2’. ఈ యేడాది బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించిన సినిమాల్లో ఇదొకటి. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. దీనికి రమేష్ వర్మ దర్శకుడు. `రాక్షసన్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి హిట్టు కొట్టారు రమేష్ వర్మ. దాంతో.. `భూల్ భులాయా 2` ఆఫర్ కూడా ఆయనకే వచ్చింది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోగా వరుణ్‌తేజ్ నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్‌తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోంది. నాలుగైదు రోజుల్లో వరుణ్ ఖాయమా, కాదా? అనే విషయంలో ఓ స్పష్టత వస్తోంది. మరోవైపు ‘రాక్షసుడు 2’ సినిమానీ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ‘రాక్షసన్’కి తమిళంలో సీక్వెల్ రాలేదు. కానీ ఈ రీమేక్‌కి మాత్రం రమేష్ వర్మ ఆసక్తికరమైన సీక్వెల్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ సైకో థ్రిల్లర్ కథ రమేష్ వర్మ దగ్గర సిద్దంగా ఉంది. దాన్ని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో ‘రాక్షసుడు 2’ పేరుతో తెరకెక్కిస్తారని సమాచారం.