వరుణ్ తేజ్ ఆలోచనా విధానం కొత్తగా ఉంటుంది. అందరూ నడిచే దారిలో నడవడు. కొత్త తరహా కథలు, ప్రయోగాత్మక పాత్రలూ ఎంచుకొంటుంటాడు. అందులో ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా ఒకటి. పుల్వామా దాడికి భారత్ తీర్చుకొనే ప్రతీకారం నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ వారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎంత ప్రయోగాత్మకమైనా వాణిజ్యపరంగా సినిమా వర్కవుట్ అయితేనే సక్సెస్ కొట్టినట్టు. వరుణ్ ఈ విషయంలోనూ విజయవంతమయ్యాడు. ఆపరేషన్ వాలెంటైన్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ఒడ్డున పడిపోయింది. ఈ సినిమాకి దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ అయ్యింది. అదంతా ఓటీటీ, శాటిలైట్ రూపంలోనే వచ్చేశాయ్.
రూ.26 కోట్లకు ఓటీటీ రైట్స్‌ని అమేజాన్ సొంతం చేసుకొంది. హిందీ శాటిలైట్ రూపంలో మరో రూ.14 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ రూ.2.60 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు శాటిలైట్ రూ.6.5 కోట్లకు బేరం జరుగుతోంది. మొత్తానికి చూసుకొంటే పెట్టుబడి మొత్తం ఈ రూపంలోనే తిరిగి వచ్చేసినట్టైంది. ఇక థియేటర్ నుంచి వచ్చేదంతా లాభమే. వరుణ్ ఇది వరకు కూడా ‘అంతరిక్షం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. అయితే అవి కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి.. వరుణ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. థియేటర్ పరంగానూ మంచి లాభాలొస్తే… వరుణ్ భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.