గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలైంటేన్… ఇలా వరుస డిజాస్టర్లు వరుణ్ తేజ్‌ని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు తనకు ఓ హిట్ అత్యవసరం. ఈ నేపథ్యంలో ‘మట్కా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. వరుణ్ తేజ్ కూడా గట్టిగా ప్రచారం చేశాడు. తానొక్కడే ప్రమోషన్ బాధ్యత భుజాలపై వేసుకొన్నాడు. ఏపీ, తెలంగాణ మొత్తం చక్కర్లు కొడుతున్నాడు. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నాయి. అయితే… బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. రేపు సినిమా విడుదల. అయితే బుక్ మై షోలో.. అంతటా బ్లూ మార్కులే కనిపిస్తున్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సైతం 5 శాతం అడ్వాన్స్ బుకింగ్ లు కూడా లేకపోవడం షాక్ ఇచ్చే విషయం.
దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. ఓటీటీ హక్కుల రూపంలో మంచి మొత్తమే వచ్చింది. శాటిలైట్ డీల్ క్లోజ్ కావాల్సివుంది. థియేట్రికల్ నుంచి నిర్మాతలు మంచి రాబడి ఆశిస్తున్నారు. కానీ.. అడ్వాన్స్ బుకింగులు ఈ రేంజ్లో ఉంటే ఎలా అనేది సందేహాల్ని రేకెత్తిస్తోంది. నిర్మాతలు ప్రమోషన్లు గట్టిగా చేసినా, కంగువా మినహా పెద్దగా పోటీ లేకున్నా ఎందుకో అడ్వాన్స్ బుకింగుల జోరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. వరుణ్ గత చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితాల్ని రాబట్టుకోలేకపోయాయి. కరుణ కుమార్ తీసిన పలాస బాక్సాఫీసు దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకొంది. తరవాత తీసిన శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలు రెండూ ఫ్లాపులే. ఆ కారణంతోనూ ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా దృష్టి పెట్టడం లేదేమో అనిపిస్తోంది. రేపు ఈసినిమా విడుదలై, మంచి టాక్ సంపాదిస్తే తప్ప, థియేటర్లు నిండుతాయన్న గ్యారెంటీ కనిపించడం లేదు. రేపు ఫస్ట్ డే, ఫస్ట్ షో.. మౌత్ టాక్ పైనే ‘మట్కా’ ఫలితం ఆధార పడి ఉంది.