వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లున్నారు. అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి, కుమారి 21 ఎఫ్‌తో అలరించిన హెబ్బా పటేల్‌ని కథానాయికలుగా ఎంచుకొన్నారు. అన్నట్టు ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్సయ్యింది. అదే మిస్టర్. ప్రస్తుతం.. స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే నెల 15 నుంచి స్పెయిన్‌లో చిత్రీకరణ మొదలెడతారు.
తొలి మూడు సినిమాలు ముకుంద, లోఫర్, కంచెలతో హీరోగా, నటుడిగా నిరూపించుకొన్న వరుణ్‌కి కమర్షియల్ హిట్ పడలేదు. మరోవైపు శ్రీనువైట్ల పరిస్థితీ అంతే. చాలా కాలంగా ఆయనతో విజయం దోబూచులాడుకొంటోంది. ఆగడు, బ్రూస్‌లీలాంటి డిజాస్టర్లతో శ్రీనువైట్ల కెరీర్ ఇరకాటంలో పడింది. ఈ దశలో ఓ సూపర్ హిట్ కొట్టి తనని తాను నిరూపించుకొనే పనిలో ఉన్నారు. అటు వరుణ్‌కీ ఇటు శ్రీనువైట్లకు ఇది డూ ఆర్ డై సినిమా. మరి మిస్టర్‌తో వీరిద్దరూ… అనుకొన్న టార్గెట్ రీచ్ అవుతారో, లేదో చూడాలి.