సినిమా జయాపజయాల మాటెలా ఉన్నా, ఎప్పుడూ ఏదో కొత్తగా ప్రయత్నించే హీరోల్లో వరుణ్ తేజ్ ముందు వరుసలో ఉంటాడు. తన చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి ‘ఆపరేషన్ వాలైంటేన్’. రెండోది ‘మట్కా’. రెండూ వేర్వేరు జోనర్లే. ‘ఆపరేషన్ వాలైంటేన్’లో నికార్సయిన దేశభక్తుడిగా కనిపిస్తున్నాడు వరుణ్. ‘మట్కా’లో అయితే… ఓ గ్యాంబ్లర్‌గా మారిపోయాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడిక్ డ్రామా ‘మట్కా’. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ‘మట్కా’ గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌తో.. సినిమా కలర్, టోన్‌తో పాటు నేపథ్యాన్నీ పరిచయం చేసే ప్రయత్నం చేశారు. వరుణ్ లుక్.. చాలా స్టైలీష్‌గా ఉంది. చేతిలో సిగార్‌తో జస్టిజ్ చౌదరి స్టైల్ లో కనిపిస్తున్నాడు. ‘ప్రామిస్’ అనే ఒకే ఒక్క డైలాగ్ ఈ గ్లింప్స్‌లో వినిపించింది. వరుణ్ ఎవరికి ప్రామిస్ చేశాడు? దాని వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా ఇతివృత్తంలా కనిపిస్తోంది. మిగిలిన పాత్రధారుల గెటప్పులు కూడా నాస్టాజికల్ ఫీలింగ్ తీసుకొస్తోంది. జీ.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ కట్టిపడేస్తున్నాయి. నోరా ఫతేహీ, మీనాక్షీ చౌదరి కథానాయికలు. నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.