వరుణ్ తేజ్ పలురకాలైన గెటప్పుల్లో నటిస్తున్న సినిమా…. ‘మట్కా’. జూదం, డబ్బు, యాక్షన్.. వీటి చుట్టూ సాగే కథ ఇది. కరుణ కుమార్ దర్శకుడు. నవంబరు 14న విడుదల అవుతోంది. ఇప్పుడు టీజర్ వదిలారు. కరుణ కుమార్ స్వతహాగా మంచి రచయిత. దానికి తగ్గట్టుగానే టీజర్ లో డైలాగులు బాగా పేలాయి.
”ఈదేశంలో చలామణీ అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కడే సంపాదిస్తాడు. మిగతా పది పైసల కోసం 99 మంది కొట్టుకొంటారు. నువ్వు 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిలా మిగిలిపోకు. నీకా దమ్ముంది”
”విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి. లేదా ఈ వాసు గుర్తుకు రావాలి”
”ధర్మం… మనకు ఏది అవసరమో అదే ధర్మం. మనిషిలో ఆశ చావనంత వరకూ నా యాపారానికి చావు ఉండదు”
– ఇలాంటి డైలాగులతో ‘మట్కా’ టీజర్ హోరెత్తింది. హీరో క్యారెక్టరైజేషన్ ఈ మాటల్లోనే కనిపిస్తోంది. ఇదో పిరియాడిక్ డ్రామా. ఆ లుక్‌ని సెట్స్ ద్వారా, కాస్ట్యూమ్స్ ద్వారా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తెరపైకి తీసుకురాగలిగింది. జీవీ ప్రకాష్ అందించిన బీజియం హాంటింగ్ గా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా వరుణ్‌తేజ్ గెటప్పులు బాగా కుదిరాయి. గ్యాంగ్ స్టర్‌గా, ఖైదీగా, జీవన పోరాటం చేసే కుర్రాడిగా వివిధ గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కంటికి కనిపిస్తున్నాయి. రిచ్ లుక్ ఉంది. కొత్త తరహా కథలు ఎంచుకొంటున్నా, ఈమధ్య వరుణ్‌కి హిట్లు పడడం లేదు. ఆ లోటు తీర్చే లక్షణాలు ‘మట్కా’లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. మీనాక్షి చౌదరి కథానాయిక.