వరుణ్‌తేజ్ ఫుల్ మాసీగా కనిపిస్తున్న సినిమా ‘మట్కా’. ఈ సినిమాలో తను చాలా గెటప్పుల్లో దర్శనం ఇవ్వనున్నాడు. పిరియాడిక్ సినిమా కాబట్టి కలర్ టోన్ కూడా వేరేలా ఉంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. ఈనెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ రోజు చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ నిండా డైలాగులే. కొన్ని మాసీగా ఉంటే, ఇంకొన్ని హీరోయిజాన్ని, క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేశాయి. ఇంకొన్ని ఫిలసాఫికల్ టచ్‌తో సాగాయి. ఈమధ్య కాలంలో ఓ ట్రైలర్ లో ఇన్ని డైలాగులు పేలడం మట్కాతోనే సాధ్యమయ్యిందేమో..?
రెండున్నర నిమిషాల ట్రైలర్ ఇది. చాలా గ్రిప్పింగ్ గా సాగింది. ‘నాకు ఇక్కడ.. ఇక్కడ.. ఇక్కడ కంట్రోల్ ఉంది కాబట్టే ఇక్కడ వరకూ రాగలిగాను’ అనే డైలాగ్ మాస్‌తో చప్పట్లు కొట్టించేలా ఉంది. కొంత బూతు కనిపించినా.. అందులో లోతైన అర్థం వుంది. ‘వేలు తీసుకొని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడ్ని కాదు. మట్కా కింగుని’, ‘అవసరం వ్యసనం అవుతుంది. వ్యసరం పతనం వైపు దారి తీస్తుంది’ లాంటి చాలా డైలాగులు ఈ ట్రైలర్లో ఆకట్టుకొన్నాయి. కరుణ కుమార్ బేసిగ్గా రచయిత. కాబట్టి తన కలం బలం చూపించగలిగాడు. మేకింగ్ వాల్యూస్ కనిపించాయి. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్ ఈ కథని మరింత ఎలివేట్ చేశాయి. వరుణ్ తేజ్ తనలోని అన్ని కోణాల్నీ బయటకు చూపించే అవకాశం ఈ పాత్రతో వచ్చిందనుకోవాలి. తనకు చాలా కాలంగా హిట్టు లేదు. కొత్తగా ప్రయత్నిస్తున్నా, లాభం లేకుండా పోతోంది. ఈసారి మాత్రం పక్కా మాస్ కమర్షియల్ సినిమా తీశాడన్న భరోసా ట్రైలర్ కలిగించింది.