వైకాపా ప్రతిపక్షంలో ఉండగా పార్టీ తరఫున రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చిన నేతల్లో ఒకరు వాసిరెడ్డి పద్మ. వ్యక్తిగత ఆరోపణలు కాకుండా, పాయింట్ టు పాయింట్ ఆమె మాట్లాడతారనే ఇమేజ్ ఉంది. అయితే, ఇప్పుడు వైకాపా అధికారంలో ఉంది. వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నిజానికి, ఆమె చట్టసభలకు వెళ్తే పార్టీ తరఫున మరింత గట్టి వాయిస్ అవుతుందని భావించారు. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉన్న నామినేటెడ్ పదవి దక్కినా.. రాజకీయాలపై మాట్లాడే అవకాశం ఉండేదని ఇప్పుడు కొందరు అంటున్నారు.
ఇదే అంశంపై వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే… తనని రాజకీయంగా బాగా మాట్లాడతారనే అన్నట్టుగానే అందరూ చూశారన్నారు. అయితే, ప్రస్తుతం తమ ప్రతిపక్ష పార్టీ పాత్ర ముగిసిపోయిందనీ, ఇప్పుడు అధికార పార్టీగా ప్రజలకు ఎంత మంచి చేయగలిగితే చేయాలన్నారు. ఇంకా రాజకీయాలు మాట్లాడటం అనేది కాకుండా, చేతనైతే నలుగురికి సాయపడే పని చేయాలనే ప్రజలు కూడా ఆశిస్తారన్నారు. తాను రాజకీయాలపై మాట్లాడటం అనేది మిస్ అవననీ, చట్టసభల్లోకి వెళ్లడానికి ఇదేమీ అడ్డంకి అయిన విషయం కాదన్నారు. మహిళలు అనే సబ్జెక్టే ఓటు బ్యాంకుతో ముడిపడి ఉందన్నారు. అంటే, 50 శాతం ఓటు బ్యాంకుకి సంబంధించిన బాధ్యతల్ని తాను నిర్వర్తిస్తున్నాననే అనుకుంటున్నాననీ… ఇది రాజకీయాలకు దూరం అయినట్టు ఎలా అవుతుందన్నారు. పాదయాత్రలోగానీ, నవరత్నాల హామీల్లోగానీ, ఎక్కడ ఏ సభల్లో సీఎం జగన్ మాట్లాడినా మహిళలే సెంటర్ పాయింట్ అన్నారు. మద్యపాన నిషేధం దగ్గర్నుంచీ అన్ని హామీలూ పథకాలూ మహిళలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే అన్నారు.
మహిళలను 50 శాతం ఓటు బ్యాంకుగా అభివర్ణిస్తూ పద్మ వ్యాఖ్యానించారు..! మహిళా సమస్యలపై ప్రధానంగా మాట్లాడకుండా… ఇకపై తాను రాజకీయాలు మాట్లాడలేనేమోనని ఎవ్వరూ అనుకోవద్దన్నట్టుగా, వాటికీ ప్రాధాన్యత ఇస్తానన్నట్టుగా ఆమె వ్యాఖ్యలున్నాయి. అధికార పార్టీ నుంచి ఏ పదవి వచ్చినా దాన్ని బాధ్యతగా చూడాలి. ఆ స్థానంలో ఉండగా ప్రజల సమస్యల పరిష్కారం గురించే పరితపిస్తున్నట్టు ఉండాలి. రాజకీయాలు, ఓటు బ్యాంకు లెక్కలు.. ఎస్, ఉంటాయి. కానీ, అవి ఎన్నికల సమయానికే పరిమితం కావాలి. ఇలా బహిరంగంగా ప్రతీచోటా మాట్లాడే అంశాలుగా, అవే ప్రాథమ్యాలుగా ఉండకూడదు కదా!