వాసిరెడ్డి పద్మ జగన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపిస్తూ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మోసంచేశారని ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్ బుక్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైసీపీని వ్యాపార సంస్థలా నడిపారని మండిపడ్డారు. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారిని జగన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కావాల్సింది గుడ్ బుక్ కాదని గుండెబుక్ అని చెప్పుకొచ్చారు.
పీఆర్పీలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఆ తర్వాత వైసీపీలో చేరి.. జగన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేశారు. అందుకే అధికారంలోకి రాగానే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఆ కృతజ్ఞతతో కుల రాజకీయాలు చేయడానికి కూడా ఆమె వెనుకాడలేదు. ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట టిక్కెట్ ఆశించారు. ఆ టిక్కెట్ ఇస్తామని చెప్పి ఉన్న పదవిని కూడా తీసేశారు. కానీ టిక్కెట్ ఇవ్వలేదు సరి కదా అప్పట్నుంచి పట్టించుకోవడం మానేశారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టాలని కూడా అడగడం లేదు.
సామినేని ఉదయభాను రాజీనామా చేసిపోయినా వాసిరెడ్డి పద్మను పట్టించుకోలేదు. చివరికి మహిళా అంశాలపై మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. టీవీ యాంకర్ శ్యామలను ప్రోత్సహిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇక అక్కడ రాజకీయ భవిష్యత్ లేదని వాసిరెడ్డి పద్మ ఫీలయ్యారు. మామూలుగా రాజీనామా చేస్తే ఎవరూ పట్టింకోరని.. గట్టిగా విమర్శలు చేస్తే జనసేనలో అయినా చేర్చుకుంటారని ఘాటు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే పీఆర్పీలో ఆమె చేసిన సేవలకు.. వైసీపీలో ఉంటూ వేసిన నిందలకు… జనసేన పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని భావిస్తున్నారు.