సాక్షి ఛానెల్ లో జరిగే లైవ్ షో లో వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు విన్న మిగతా పార్టిసిపెంట్స్ తో పాటు, షో నిర్వహిస్తున్న కొమ్మినేని కూడా ఆశ్చర్యపోయారు. “అదేంటి, ఒక్కసరిగా అంత మాటనేశారు” అని ఆమె ని అడిగిన కొమ్మినేని, ఆ వ్యాఖ్యలతో తానూ ఖంగు తిన్నానన్న విషయాన్ని ఆయన దాచలేకపోయారు. ఇంతకీ ఆవిడ ఏమన్నారో చూద్దాం.
నంద్యాల ఫలితాలయ్యాక ప్రశాంత్ కిషోర్ కేంద్రం గా జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫలితాలకి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదని, ఆయన కేవలం 2019 సాధారణ ఎన్నికల కోసమే నియమింపబడ్డాడు కానీ ఉప ఎన్నిక కోసం కాదని, భూమన కరుణాకర్ లాంటి వైసిపి నేతలు ఆల్రెడీ ప్రకటించేసారు. మిగతా వైసిపి నేతలు కూడా అంతర్గతంగా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నా, బయటికి మాత్రం ప్రశాంత్ కిషోర్ ని సమర్థిస్తూనే మాట్లాడారు. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ ఫాం మీద ప్రశాంత్ కిషోర్ కి వ్యతిరేకంగా మాట్లాడిన తొలి వైసిపి వ్యక్తి వాసిరెడ్డి పద్మ అవుతారు. ఆమె మాట్లాడుతూ, “నంద్యాల ఫలితాలు, ప్రశాంత్ కిషోర్ కి చెంపపెట్టు లాంటివి” అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఖంగు తిన్న కొమ్మినేని అదేంటి, అంత మాటనేసారు అని ప్రశ్నిస్తే, ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ తదితర ఉత్తరాది వ్యూహాలు దక్షిణాది లో పనిచేయవని గుర్తించాలనీ, వాటిని ఇక్కడ ప్రయోగిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అభిప్రాయపడ్డారు.
అయితే, ఆ తర్వాత కొమ్మినేని, “మరి ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ కి వెళ్ళిపోతున్నాడనీ, వైసిపి కి ఇకమీదట పనిచేయబోవడం లేదనీ వస్తున్న రూమర్ల పై ఏమంటారు” అన్న ప్రశ్నకి మాత్రం కొంత పాజిటివ్ గా స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఆయన 2019 కి వైసిపికి వ్యూహకర్త గా ఉంటారనీ అంటూ, ఆయన వ్యూహలు మత్రం సరిచేసుకోవాలని హితవు చెప్పారు.