ఒక్కోసారి చెడు విషయాలలో కూడా పాజిటివ్ థింకింగ్ చేస్తున్నవాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మావతి మాటలు వింటే ఆమె ఆశావాహక దృక్పదానికి ముచ్చటేస్తుంది. ఆమె తమ పార్టీ అధికారంలోకి వస్తుంది…జగన్ ముఖ్యమంత్రి …తను ఏదో శాఖకు మంత్రి అవుతానని ఊహించుకొని చెప్పడం లేదు. ఇప్పుడు దేశ, విదేశాలలో సంచలనం సృష్టిస్తున్న ‘పనామా పేపర్ల లీకుల’ గురించి మాట్లాడారు.
భారత్ కి చెందిన సుమారు 500 మంది వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు విదేశాలలో బోగస్ సంస్థలను సృష్టించి దానిలోకి భారీగా డబ్బు తరలించినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో అమితాబచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యా బచ్చన్, రష్యా అధ్యక్షుడు పుతీన్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వంటి అనేకమంది పేర్లున్నాయి. ఈరోజు కూడా ఇండియన్ ఎక్స్ ప్రెస్ మరికొందరి ప్రముఖుల పేర్లను బయటపెట్టింది.
దానిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు కూడా బయటపడుతుందని వాసిరెడ్డి పద్మావతి జోస్యం చెప్పారు. చాలా ఏళ్ల క్రితమే తెహల్కా డాట్ కాం అనే పరిశోధక వెబ్ సైట్, చంద్రబాబు నాయుడు విదేశాలలో చాలా భారీగా డబ్బు దాచిపెట్టేరని బయటపెట్టిందని, మళ్ళీ ఇప్పుడు పనామా పేపర్స్ లో కూడా ఆయన పేరు తప్పకుండా బయటకు వస్తుందని ఆమె దృడంగా చెప్పారు. కేంద్రప్రభుత్వం విదేశాలలో నల్లదనం దాచిన వారిపై దర్యాప్తు చేయిస్తే, వారిలో చంద్రబాబు నాయుడు పేరే మొట్టమొదట బయటకొస్తుందని వాసిరెడ్డి అన్నారు. పట్టిసీమ, రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు నాయుడు నేటికీ వేల కోట్లు దోచుకొంటున్నారని ఆమె ఆరోపించారు. రాజధాని బినామీ భూముల వ్యవహరంపై సిబీఐ చేత విచారణ జరిపిస్తే దానిలో కూడా చంద్రబాబు నాయుడు పేరు తప్పకుండా బయటపడుతుందని ఆమె అన్నారు. అతిత్వరలోనే బాబు పేరుని కూడా పనామా పేపర్స్ జాబితాలో చూడబోతున్నామని వాసిరెడ్డి పద్మావతి చెప్పారు. ఆమెకి చంద్రబాబు నాయుడుపై అంత అపారనమ్మకం కలిగి ఉండటం విశేషమే.