వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవన్ వాస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. వాయువ్య దిశలోని గేటు నుంచి రాకపోకలు సాగించడమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమనే వాస్తు పండితుల సూచనతో భవన్ లో మార్పులు , చేర్పులకు కేసీఆర్ ఆదేశించారు. ఈశాన్యం నుంచి రాకపోకలు కొనసాగేలా కొత్తగా మార్పులు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడంతో ఈమేరకు మార్పులు చేస్తున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న బీఆర్ఎస్ భవన్ తూర్పు అభిముఖంగా ఉంది. అయితే, ప్రవేశ ద్వారం వాయువ్యం నుంచి ఉండటం సరైంది కాదని , ఈశాన్యం నుంచి ఉండాలని పండితులు కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది. వాస్తు ప్రకారం మార్పులు చేశాకే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్న సమయంలో వాస్తు మార్పులు ఊరటనిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ వాస్తుమార్పులు దోహదం చేస్తాయని కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ కు సాధారణంగా ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే పండితుల సూచన మేరకు వెంటనే మార్పులకు ఆదేశించారని తెలుస్తోంది. ఈశాన్యం నుంచి రాకపోకలను కొనసాగిస్తే పార్టీ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని పార్టీ భావిస్తోంది. అవసరమైతే పార్టీ కార్యాలయంలో ఇంకొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.
బీఆర్ఎస్ కార్యాలయ వాస్తు దోషంపై ఆ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదే కార్యాలయం వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు. రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారం కోల్పోగానే తప్పిదం.. వాస్తు దోషంలో ఉందని పేర్కొనటం చూసి విస్తుపోతున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో ఆలోచించకుండా ఇలాంటి వాస్తు దోషాలను నమ్ముతూ పోతే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు ఆ పార్టీ విమర్శకులు.