ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలక వ్యక్తిగా సీఐడీ అధికారులు భావిస్తున్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని మాతృశాఖకు వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆయనను రిలీవ్ చేశారు. ఆయనను ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. కానీ సీఐడీ అధికారులు ఆయనతో పూర్తి స్థాయి వివరాలు రాబట్టారు. కోర్టు ముందు కూడా వాంగ్మూలాలు ఇప్పించారు.
దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఏపీ వ్యక్తి కాదు..అసలు ఏపీ ఉద్యోగి కాదు.. కనీసం ఐఏఎస్ కాదు.. ఆయన రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఉద్యోగి. ఆయనను వైసీపీ నేతలు ఏపీకి పిలిపించి.. ఆయన కేంద్రంగానే మద్యం దందా చేశారు. వేల కోట్ల ఈ మద్యం స్కాంలో మొత్తం వాసుదేవరెడ్డినే ప్రధాన పాత్రధారి. కానీ ఆయన కేవలం సంతకాలకే పరిమితం. ఆయనకు కొంత కమిషన్ ఇచ్చి ఆయన పేరు మీద స్కాం చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత తన పరిస్థితి ఏమిటో ఆయనకు అర్థమయింది. నోరు తెరవకపోతే తన ఉద్యోగమే కాదు.. తన జీవితం కూడా పూర్తిగా జైలుకు పరిమితమవుతుందన్న అంచనాతో ఆయన మొత్తం వివరాలు సీఐడీకి చెప్పేశారు. తాము చేయాలనుకున్న అవినీతికి ఓ బకరా కోసమే ఆయనను వైసీపీ నేతలు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు అన్ని వివరాలు ఇచ్చేసి.. తన దారి తాను చూసుకున్నారు. ఇక అసలు ఆట ప్రారంభం కావాల్సి ఉంది.