‘ఫక్ ఆల్ రివ్యూస్’ – ‘వీర భోగ వసంత రాయులు’ దర్శకుడు ఇదే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్ విడుదల చేశాడు. సదరు దర్శకుడి కసి, కోపం, నిస్సహాయతల్ని ఈ పోస్టర్ అద్దం పడుతుంది. రివ్యూలు సరిగా లేకపోతే, అందులో తీవ్రమైన విమర్శ ఉంటే తట్టుకోలేని నాలుకలు, మెదళ్లు ఏమైనా అంటాయి, ఎలాగైనా ఆలోచిస్తాయి. ఆ కసిలోంచి పుట్టుకొచ్చిన స్టేట్మెంట్ ఇదని ఎవ్వరికైనా అర్థమవుతుంది.
ఈ శుక్రవారం విడుదలైన `వీర భోగ వసంత రాయులు`కు రివ్యూలేం బాగోలేని మాట వాస్తవం. పోనీ వసూళ్లయినా ఉన్నాయా అంటే… అవీ లేవు.
సినిమా బాగుండి, రివ్యూలు బాగోలేకపోయినా – వసూళ్లు కుమ్మేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘పందెంకోడి 2’కి వచ్చిన ఏ రివ్యూ గొప్పగా లేదు. కానీ మాస్లో ఆ సినిమా నిలబడగలిగింది. పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోగలిగింది. మరి… వీర భోగ వసంత రాయులు.. మాటేంటి? సినిమా బాగుంటే, రివ్యూలు ఎలావున్నా జనం చూడాలి కదా? మరి అది జరగలేదేం..?
రివ్యూ అద్దం లాంటిది. సినిమాని బట్టే రివ్యూ. ఈ విషయాన్ని కొంతమంది మేధావులు అర్థం చేసుకలేరు. అలాంటి జాబితాలో ‘ఇంద్రసేన’ కూడా చేరిపోయాడు. రివ్యూలంటే భజనలు కాదని, కొండని అద్దంలో చూపించడమని సదరు దర్శకుడు తెలుసుకుంటే మంచిదేమో. అన్నట్టు ఇంద్రసేన గురించి ఓ మాట చెప్పాలి. సుకుమార్‌ని తన సినిమా ఫంక్షన్‌ని గెస్ట్ గా పిలిచి… `వన్ సినిమా మీరు సరిగా తీయలేకపోయారు.. నేనైతే సూపర్ హిట్ చేసేవాడ్ని. ఈ సినిమాతో నేనే మీకు పోటీ` అంటూ బిల్డప్పులు ఇచ్చాడు. అది ఓవర్ కాన్ఫిడెన్సా? లేదంటే నిజంగానే `వన్` సినిమాపై తనకు అలాంటి అభిప్రాయమే ఉందా? అనేది పక్కన పెడితే..
ఓ వేదికపై, మీడియా అంతా ఉండగా.. ఓ దర్శకుడ్ని పట్టుకుని `నీ సినిమా నాకు నచ్చలేదు` అంటూ స్టేట్మెంట్ ఇవ్వడమేంటి? ఓ రకంగా… ‘వన్’ సినిమాపై అది ఇంద్రసేన ఇచ్చిన రివ్యూ అనుకోవాలి. రివ్యూలు కూడా చేసే పని అదే కదా? నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెప్పడం రివ్యూల కర్తవ్వం. `వీ.భో.వ.రా` రివ్యూలన్నీ ఈ సినిమాపై వ్యతిరేకంగానే ఉన్నాయంటే – యునానిమస్‌గా ఈ సినిమా ఎవ్వరికీ నచ్చలేదనే కదా? ఓ దర్శకుడ్ని పిలిచి ‘నీ సినిమా బాలేదు’ అని చెప్పగలిగిన ఓ కుర్ర దర్శకుడు – తన సినిమాపై వచ్చిన నెగిటీవ్ రివ్యూల్ని ఎందుకు
రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు..?
శ్రీ విష్ణు సంగతికి వద్దాం. తన సినిమాల్లో విషయం ఉన్నప్పుడల్లా రివ్యూలు మోశాయి. `నీదీ నాదీ ఒకే కథ`, `అప్పట్లో ఒకడుండేవాడు` సినిమాలకు వచ్చిన రివ్యూల్ని విష్ణు మరోసారి చదువుకుంటే మంచిది. ఎందుకంటే అవన్నీ విష్ణు కష్టాన్నీ, తపననీ అద్దంలో చూపించాయి. అలాంటి రివ్యూలు వచ్చినప్పుడు పొంగిపోయిన శ్రీవిష్ణు ‘ఫక్ ఆల్ రివ్యూస్’ అనే పోస్టర్ని విడుదల చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు.
ఇప్పుడు తీరిగ్గా ‘నేను రివ్యూల్ని గౌరవిస్తాను’ అంటూ ఓ స్టేట్మెంట్ పడేశాడు. పొగిడినప్పుడు పొంగిపోవడం కాదు, విమర్శించినప్పుడు ఓసారి ఆగి, ఆలోచించడం ఉత్తమ మైన లక్షణం. సినిమా హిట్‌కీ, ఫట్కీ రివ్యూలు కారణం కాదు. ప్రేక్షకాదరణే కీలకం. అసలైన న్యాయ నిర్ణేతలు సమీక్షకులు కాదు, ప్రేక్షకులు. నవతరం దర్శకులు, కథానాయకులు ఈ విషయాన్ని గమనించాలి.