అమీర్ ఖాన్ సినిమా ‘పీకే’ గుర్తుంది కదా? అందులో అమీర్ ఓ గ్రహాంతర వాసి. ఈ భూమ్మీద అనుకోని పరిస్థితుల్లో ఉండిపోవాల్సివస్తుంది. ఇక్కడ దిగాక.. దేవుళ్లతో ఓ ఆట ఆడుకుంటాడు. అటూ ఇటుగా ‘వీర భోగ వసంత రాయులు’ సినిమా కూడా ఇదే పాయింట్‌పై నడుస్తుందేమో అనిపిస్తోంది. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు కథానాయకులుగా నటిస్తున్న సినిమా ఇది. శ్రియ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో శ్రీవిష్ణు గ్రహాంతర వాసిగా కనిపించనున్నాడు. టీజర్లో మతాలు, దేవుళ్లకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంది.
“నాకు తెలుసు మీరు వాళ్ళ రాక కోసం ఎన్ని పూజలు ప్రార్థనలు చేస్తున్నారో అని. నాకు తెలుసు మీరు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారని. ఎందుకంటే మీలాగా ఎదురు చూసే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి. ఎదురు చూశాం.. ఎదురు చూశాం.. క్షణాలు కాదు.. నిముషాలు కాదు.. గంటలు కాదు.. రోజులు కాదు.. నెలల తరబడి ఎదురు చూశాం. కానీ వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. సో.. టుడే వీ నీడ్ టు బ్రేక్ ద సైలెన్స్. టుడే వీ నీడ్ తో మేక్ సెన్స్. టుడే వి నీడ్ టు గెట్ ప్రాక్టికల్.ష – అంటూ సాగే ఈ డైలాగ్ చూస్తుంటే.. కచ్చితంగా ఈ సినిమా కూడా ‘పీకే’లానే దేవుళ్లు, మూఢనమ్మకాలు, బాబాలపై గురి పెట్టిన బాణంలా అనిపిస్తోంది. ‘ప్రతినిధి’ లాంటి సినిమాలతో సామాన్యుల్ని షేక్ చేశాడు నారా రోహిత్. సామాన్యుల మనసులో ఉన్న ప్రశ్నల్ని వెండి తెరపై సన్నివేశాలుగా రంగరించాడు. ఇప్పుడూ అదే ప్రయత్నం జరిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. టీజర్ చివర్లో కూడా అది కనిపిస్తుంది. గుర్రం మీద వస్తున్న ఓ వ్యక్తి.. కనీకనిపించనట్టుగా కనిపిస్తాడందులో. అది శ్రీవిష్ణునే. ఆ పాత్ర గ్రహంతర వాసి కాబట్టి.. ఇప్పుడే రివీల్ చేయడం ఇష్టంలేక శ్రీవిష్ణుని అలా నీడలోనే దాచేశారన్నమాట.